రైతు బంధు బంద్.. కొత్తగా రాహుల్ బంధు పథకం: కేటీఆర్
ABN , Publish Date - Mar 09 , 2026 | 05:32 PM
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమేనా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. మూడో పంటకు రైతు బంధు వేయాలని డిమాండ్ చేశారు. కానీ నేటికి మూడో నెల వచ్చిన రైతు బంధు వేయలేదని రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిరిసిల్ల, మార్చి 09: రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని బంద్ చేసి.. కొత్తగా రాహుల్ బంధు పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ తీసుకు వచ్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఏడాదికి రూ. వెయ్యి కోట్లు పంపడమే రాహుల్ బంధు పథకమని ఆయన అభివర్ణించారు. సంవత్సరానికి రూ.1000 కోట్లు కప్పం కట్టి తన పదవిని సీఎం రేవంత్ రెడ్డి కాపాడుకొంటున్నారని ఆరోపించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆయన ఘనంగా సన్మానించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమేనా అని ప్రశ్నించారు. మూడో పంటకు రైతు బంధు వేయాలన్నారు. కానీ నేటికి మూడో నెల వచ్చిన రైతు బంధు వేయడం లేదని రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక కష్టాలు ఉన్న మాట నిజమైతే రూ.లక్షన్నర కోట్లతో మూసి సుందరీకరణ ఎవరు చేయమన్నారంటూ రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. రైతు బంధు మీద దృష్టి పెట్టు.. అంతేకానీ రాహుల్ బంధు మీద కాదంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు.
ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వికలాంగుల ఇళ్లను సైతం నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత ఇల్లు, ఆయన సోదరుడి ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని.. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై కేటీఆర్ వ్యంగ్య బాణాలు సంధించారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి.. వెయ్యి రోజులు కావస్తున్నా అతీగతీ లేదని విమర్శించారు. ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం, రైతులకు పంట బోనస్, మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక: రిటర్నింగ్ అధికారి
మహిళల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదం: మంత్రి సవిత
Read Latest TG News And Telugu News