Share News

రెండు నెలల నిరీక్షణకు తెర

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:06 AM

కడుపున పుట్టకపోయినా అల్లారుముద్డుగా పెంచుకున్న బిడ్డ దూరమవడంతో.. ఆ తల్లిదండ్రులు పడిన ఆవేదనకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది.

రెండు నెలల నిరీక్షణకు తెర
Jagtial Adoption Case

  • పెంపుడు తల్లిదండ్రుల చెంతకు చేరిన దత్తత బాలుడు

జగిత్యాల, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కడుపున పుట్టకపోయినా అల్లారుముద్డుగా పెంచుకున్న బిడ్డ దూరమవడంతో.. ఆ తల్లిదండ్రులు పడిన ఆవేదనకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. దత్తత వివాదంతో పెంచిన తల్లిదండ్రులకు దూరమైన మూడేళ్ల బాలుడు రెండు నెలల తర్వాత తిరిగి వారి ఒడికి చేరుకున్నాడు. జగిత్యాల జిల్లాకు చెందిన కాసారపు సరిత- శ్రీనివాస్‌గౌడ్‌ దంపతులకు సోమవారం రాత్రి కరీంనగర్‌ శిశు గృహ అధికారులు బాలుడిని అప్పగించారు. దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా లేదనే కారణంతో అధికారులు రెండు నెలల క్రితం ఆ బాలుడిని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు.


అయితే, సదరు బాలుడిని దంపతులకే అప్పగించాలని హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ, అధికారుల జాప్యంతో బాలుడి అప్పగింత ఆలస్యమైంది. ఈ క్రమంలో ఇటీవల బాలుడిని చూడడానికి కరీంనగర్‌లోని శిశు గృహకు వెళ్లిన దంపతులను చూసి ‘అమ్మా భయం వేస్తోంది...నన్ను తీసుకువెళ్లు’ అంటూ బాలుడు ఏడ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యం పలువురిని కలిచివేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన జగిత్యాల కలెక్టర్‌ సత్యప్రసాద్‌.. బాలుడిని దత్తత తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి మార్గం సుగమం చేశారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో సోమవారం రాత్రి శిశు సంరక్షణ శాఖ అధికారులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇన్నాళ్లు నిరీక్షించిన ఆ దంపతులు చిన్నారిని గుండెలకు హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 06:06 AM