Share News

వేములవాడ గోశాలలో కోడెల మృతి.. సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవు: ఆది శ్రీనివాస్

ABN , Publish Date - Aug 26 , 2026 | 10:52 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ తిప్పాపూర్ గోశాలలో ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. గోశాల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

వేములవాడ గోశాలలో కోడెల మృతి.. సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవు: ఆది శ్రీనివాస్
Adi Srinivas

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ తిప్పాపూర్ గోశాలలో ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) స్పందించారు. గోశాల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గోశాలలో కోడెల సంరక్షణ, నిర్వహణపై అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.


మృతిచెందిన ఐదు కోడెల ఘటన నేపథ్యంలో వేములవాడలోని తిప్పాపూర్ గోశాలను ఈరోజు (బుధవారం) ఆది శ్రీనివాస్ సందర్శించారు. గోశాలలో పరిస్థితులను పరిశీలించి, కోడెలకు అందుతున్న సంరక్షణ, ఆహారం, వైద్య సేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా గోశాల నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు.


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో 40 ఎకరాల్లో ఆధునిక గోశాల నిర్మించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కోడెల సంఖ్యకు అనుగుణంగా గోశాల సామర్థ్యాన్ని పెంచుతున్నామని తెలిపారు. అవసరమైన మేరకు కోడెలను ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు.


భక్తులు సమర్పించే నిజ కోడెలను గోశాలకు తీసుకువచ్చిన వెంటనే ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా వచ్చే కోడెల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాతే వాటిని ఇతర కోడెలతో కలపాలని సూచించారు. దీనివల్ల వ్యాధుల వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుందని ఆది శ్రీనివాస్ తెలిపారు.


అలాగే, పాలు మానేసిన కోడెలను మాత్రమే భక్తులు స్వామివారికి సమర్పించాలని ఆది శ్రీనివాస్ సూచించారు. గోశాలలో కోడెలకు మెరుగైన సంరక్షణ అందించడంతో పాటు భక్తుల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు.


ఐదు కోడెల మృతికి గల కారణాలపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జనగణన పద్ధతిపై రాహుల్, ఖర్గే నిరసన.. ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ

నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకం: గవర్నర్

పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్‌.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 11:06 AM