Share News

డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి తెర.. జానీ మాస్టర్‌పై బహిష్కరణ ఎత్తివేత

ABN , Publish Date - Jul 19 , 2026 | 09:52 PM

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి తెరపడింది. దీంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై బహిష్కరణను ఎత్తివేస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది.

డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి తెర.. జానీ మాస్టర్‌పై బహిష్కరణ ఎత్తివేత
Tollywood Dancers Association Dispute Resolved

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడం సహా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై శాశ్వత బహిష్కరణను ఉపసంహరించుకుంటున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది.


ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, దర్శకుల సంఘం తరఫున సాయి రాజేశ్, నిర్మాతల మండలి నుంచి చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ సమక్షంలో జానీ మాస్టర్, డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతతో సుదీర్ఘ చర్చలు జరిపారు. సమావేశం అనంతరం అనిల్ మాట్లాడుతూ.. 'డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై జానీ మాస్టర్, సుమలత వివరణ ఇచ్చారు. దీంతో ఫెడరేషన్ సంతృప్తి చెందింది. అందువల్ల జానీ మాస్టర్‌పై విధించిన శాశ్వత బహిష్కరణను ఎత్తివేస్తున్నాం. ఈ నెల 26న జరిగే డ్యాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో రాజీనామాలు చేసిన సభ్యులంతా తిరిగి కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాం' అని చెప్పారు.


జానీ మాస్టర్ మాట్లాడుతూ.. 'జరిగిన పరిణామాలపై ఫెడరేషన్‌కు పూర్తి వివరణ ఇచ్చాం. దీంతో వివాదానికి ముగింపు లభించింది. సమస్య పరిష్కారంలో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకోవడం అభినందనీయం. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. అలాగే నందమూరి బాలకృష్ణ కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు తన వంతు సహకారమందించారు' అని అన్నారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత స్పందిస్తూ.. 'డ్యాన్సర్ల సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం. కొన్ని రోజులుగా కొనసాగుతున్న పరిణామాలకు నేటితో పూర్తిస్థాయిలో తెరపడింది. చిరంజీవికి కృతజ్ఞతలు. ఇకపై అందరూ కలిసి అసోసియేషన్ అభివృద్ధి కోసం పనిచేస్తాం' అని హామీ ఇచ్చారు.


నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ స్పందిస్తూ.. ఓ కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినట్లే ఈ వివాదమూ పరిష్కారమైందన్నారు. అసోసియేషన్ సభ్యులంతా ఇకపై ఐక్యంగా ముందుకు సాగుతారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం బాలకృష్ణ ప్రత్యేకంగా మాట్లాడి చొరవ తీసుకున్నారని వెల్లడించారు. ఇక నిర్మాతల మండలి ప్రతినిధి చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'కాకినాడ నుంచి బాలకృష్ణ ఫోన్ చేసి సినీ పరిశ్రమలో ఇలాంటి విభేదాలు కొనసాగకూడదని సూచిస్తూ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. ఇరువర్గాల డ్యాన్సర్లు ఎంతో కష్టపడి పనిచేసే వారే. అందరూ కలిసి పనిచేసేలా వివాదానికి శాశ్వతంగా ముగింపు పలికారు' అని పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 19 , 2026 | 09:52 PM