Share News

తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలంటూ ప్రజావాణిలో మహిళ విజ్ఞప్తి.. స్పందించిన సీఎం రేవంత్

ABN , Publish Date - Oct 12 , 2026 | 09:33 PM

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాలకు చెందిన వలస కార్మికుడు అవిలాల సుదర్శన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.6 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలంటూ ప్రజావాణిలో మహిళ విజ్ఞప్తి.. స్పందించిన సీఎం రేవంత్
revanth reddy aid to jagithay migration worker

హైదరాబాద్, అక్టోబర్ 12: జగిత్యాల జిల్లాకు చెందిన వలస కార్మికుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. మృతుడి భార్య.. ప్రవాసీ ప్రజావాణిలో చేసిన విజ్ఞప్తి మేరకు స్పందించిన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.6 లక్షలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..


జగిత్యాల జిల్లాలోని హుస్నాబాద్‌కు చెందిన అవిలాల సుదర్శన్.. నాలుగు నెలల క్రితం ఉపాధి నిమిత్తం ఉక్రెయిన్‌కు వలస వెళ్లారు. అక్కడ కన్‌స్ట్రక్షన్ రంగంలో కార్మికుడిగా పని చేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్‌ల మధ్య కొన్నేళ్లుగా యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2026 సెప్టెంబర్ 1న ఉదయం రష్యా.. ఉక్రెయిన్‌పై క్షిపణిదాడికి పాల్పడింది. ఈ దాడిలో సుదర్శన్ తీవ్రంగా గాయపడి.. అక్కడికక్కడే మృతి చెందారు. అవిలాల సుదర్శన్ మరణించి నెల గడుస్తున్నా.. ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులు స్వదేశానికి తీసుకురాలేకపోయారు. మృతదేహాన్ని తీసుకురావడానికి అయ్యే ఖర్చును భరించలేని బాధిత కుటుంబసభ్యులు చందాలు వసూలు చేస్తున్నారు.


విషయం తెలుసుకున్న ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఈ మేరకు స్పందించిన సీఎం.. ప్రవాసీ ప్రజావాణిలో వినతి పత్రం అందింపజేసి.. తద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 6 లక్షల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.


ఇవి కూడా చదవండి:

యూట్యూబ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చూసి నేర్చుకున్నా: ఆసీస్ ప్లేయర్

భారత్-శ్రీలంక మ్యాచ్ వేదిక మార్పుపై వార్తలు.. బీసీసీఐ క్లారిటీ

Updated Date - Oct 12 , 2026 | 09:57 PM