Share News

భక్తే శ్వాసగా ఈశ్వరమ్మ.. గుట్టపైనే తుదిశ్వాస!

ABN , Publish Date - Sep 23 , 2026 | 07:09 AM

పోలియోతో కాళ్లు చచ్చిబడిపోయిన స్థితిలో భక్తులు తోచినంత ఇస్తే యాచకురాలిగా పొట్టపోసుకుంటూ.. వచ్చిన ఆ డబ్బులో సింహభాగాన్ని స్వామివారి పూజలకే వెచ్చిస్తున్న ఓ మహిళ చివరికి స్వామివారి సన్నిధిలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది.

భక్తే శ్వాసగా ఈశ్వరమ్మ.. గుట్టపైనే తుదిశ్వాస!
Yadadri Temple Accident

  • యాదగిరి గుట్టపై కారు ఢీకొని యాచకురాలి దుర్మరణం

  • పోలియోతో చచ్చుబడిన కాళ్లు..

  • భిక్షాటన డబ్బులో అధిక భాగం స్వామివారి పూజల కోసమే ఖర్చు

యాదాద్రి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పోలియోతో కాళ్లు చచ్చిబడిపోయిన స్థితిలో భక్తులు తోచినంత ఇస్తే యాచకురాలిగా పొట్టపోసుకుంటూ.. వచ్చిన ఆ డబ్బులో సింహభాగాన్ని స్వామివారి పూజలకే వెచ్చిస్తున్న ఓ మహిళ చివరికి స్వామివారి సన్నిధిలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. మృతురాలు హనుమకొండ జిల్లా వెల్లూరుకు చెందిన 50ఏళ్ల ఈశ్వరమ్మ! ఈ విషాద ఘటన యాదగిరి గుట్టపై మంగళవారం జరిగింది. ఈశ్వరమ్మ అవివాహిత. బతుకుదెరువు కోసం భిక్షాటననే నమ్ముకుంది. కొన్నేళ్లుగా యాదగిరిగుట్టపైనే ఉంటోంది. మంగళవారం గుట్టపై భిక్షాటన చేస్తూ, ఆంజనేయస్వామి ఆలయ మార్గంలోని సులభ్‌ కాంప్లెక్స్‌ వద్ద నిలిపిఉన్న ఓ కారు వద్దకు వెళ్లింది. ఆ వాహన యజమాని, హైదరాబాద్‌ నార్సింగికి చెందిన రాచర్ల మధుసూదన్‌రాజు(48) తన కుమారుడితో స్వామివారి దర్శనానికి వచ్చాడు. ఈశ్వరమ్మ అడిగితే కొంత డబ్బు ఇచ్చాడు. అనంతరం ఈశ్వరమ్మ కారు ముందు నుంచి వెళుతుండటాన్ని గమనించని మధుసూదనరాజు కారును ముందుకు దూకించడంతో టైరు నేరుగా ఆమె తల మీద నుంచి వెళ్లింది. ఈశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.


పోలీసులు, భద్రతా సిబ్బంది చేరుకొని మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడు మధుసూదన్‌రాజును అదుపులోకి తీసుకున్నారు. ఈశ్వరమ్మకు స్వామిపై ఆపారమైన భక్తిభావం ఉండేదని పలువురు పేర్కొన్నారు. భిక్షటన తాలూకు సంపాదనలో కొంతే తన కోసం పెట్టుకొని, మిగతా అంతా స్వామివారి సన్నిధిలో ఆంజనేయుడికి ఆకుపూజ, ప్రధానాలయంలో సుదర్శన నారసింహ హోమ పూజలు, నిత్యకల్యాణం వంటి సేవలకు ఇచ్చేసేదని అక్కడి వ్యాపారులు, ఉద్యోగులు చెప్పారు. ‘స్వామివారి దయతోనే బతుకుతున్నా.. భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్మును ఆయనకే అర్పిస్తే నా జన్మకు ధన్యత చేకూరుతుంది’ అని తరచూ ఈశ్వరమ్మ అనేదని చెప్పారు. గుట్టపై ఈశ్వరమ్మ మృతితో వెంటనే ఆలయాన్ని మూసివేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించాక ఆలయాన్ని, వీధులను శుద్ధి చేశారు. ఆగమ శాస్త్రరీతిలో సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి తిరుమంజన పూజలు జరిపి, నిత్యకైంకర్యాల అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్‌ షాప్‌ల బంద్‌
అనని మాటలు కాదు.. కాంగ్రెస్‌ నేతలు అన్నమాటలే

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 07:09 AM