Share News

అన్నేళ్లు లైంగిక వేధింపులు ఎందుకు భరించారు?

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:46 AM

జూబ్లీహిల్స్‌ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై నమోదైన కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అన్నేళ్లు లైంగిక వేధింపులు ఎందుకు భరించారు?
Supreme Court

  • పోలీసు అధికారితో సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరమేంటి?

  • వివాహితపై జూబ్లీహిల్స్‌ మాజీ సీఐ వేధింపుల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై నమోదైన కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యావంతురాలైన బాధిత మహిళ అన్నేళ్ల పాటు లైంగిక వేధింపులను ఎందుకు భరించారు ? కుమారుడితో కలిసి వేరుగా ఉంటున్న బాధితురాలికి పోలీసు అధికారితో సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరమేంటి ? అని ప్రశ్నించింది. ఐదేళ్లలో పలు పరిణామాలున్నందున.. అసలు ఇదంతా పరస్పర అం గీకారంతో జరిగిందా ? అనే విషయం తేలాలని అభిప్రాయపడింది. బాధితురాలు విద్యావంతురాలైనా ఐదేళ్లుగా లైంగిక వేధింపులను ఎందుకు భరించాల్సి వచ్చిందని, ఐదేళ్లుగా ఎందుకు ఫిర్యాదు చేయలేదని దర్మాసనం అడిగింది. ఓ వివాహిత తన కుమారుడితో వేరుగా ఉంటూ పోలీస్‌ అధికారితో సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది.


2021లో భర్తపై ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు మొదలైన ఈ వ్యవహారంలో 2026లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, ఈ ఐదేళ్లలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నందున ఇది పరస్పర సమ్మతితో జరిగిందా? లేదా? అన్నదే కీలక ప్రశ్న అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరువర్గాల మధ్య ఆర్థిక వివాదాలు ఉన్నట్లు కనిపిస్తోందని, వాటిని పరిష్కరించుకోవాలని సూచిస్తూ తదుపరి విచారణను నవంబరు 30కి వాయిదా వేసింది. అప్పటి వరకూ శ్రీనివాసులు రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. విచారణకు శ్రీనివాసులు రెడ్డి సంపూర్ణంగా సహకరించాలని కూడా ఆదేశించింది. కుటుంబ వివాద పరిష్కారానికి వెళితే సీఐ తనను బలవంతంగా లోబరుచుకుని, బ్లాక్‌ మెయిల్‌ చేశాడని జూబ్లీహిల్స్‌ మాజీ సీఐ శ్రీనివాసులురెడ్డిపై డీజీపీకి, హైదరాబాద్‌ సీపీకి ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్‌ చేశారు. అమీన్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాసులు రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును శ్రీనివాసులు రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆ పిటిషన్‌ను విచారించింది.


అంతా కట్టు కథ..

శ్రీనివాసులు రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, పీ.మోహిత్‌ రావు(ఏవోఆర్‌) వాదనలు వినిపించారు. సదరు మహిళ, పోలీస్‌ అధికారి ఒకే ప్రాంతం వారని, ఒకరికొకరు తెలిసినవారేనని, ఆరోపణలంతా ఓ కట్టు కథని తెలిపారు. 2021 నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయని, 2024లో వేధింపులు జరిగాయని చెబుతున్నా, 2025లోనూ ఇరుకుటుంబాల మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగాయని చెబుతూ ఽఆధారాలు సమర్పించారు. రూ.కోటికి పైగా నగదు లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలు అవాస్తవమని కేవలం రూ. లక్ష, రూ.50 వేలు, రూ.30 వేలు వంటి మొత్తాలే బదిలీ అయ్యాయన్నారు. బాధితురాలు విద్యావంతురాలని, స్థానిక అధికారి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుంటే ఆమెకు పలు చట్టపర మార్గాలున్నాయని గుర్తుచేశారు. అయితే, ఇది పరస్పర సమ్మతితో జరిగిన వ్యవహారం కాదని, తీవ్రమైన బెదిరింపులు, లైంగిక వేధింపులు, బలవంతపు అబార్షన్‌కు సంబంధించిన కేసు అని బాధితురాలి తరఫు న్యాయవాది వాదించారు. నిందితుడు రూ.కోటికి పైగా వసూలు చేశాడని, బలవంతపు అబార్షన్‌ చేయించినట్లు ఆధారాలున్నాయని నివేదించారు. దాని వల్లే సదరు అధికారి సస్పెండ్‌ అయ్యారని, ప్రస్తుతం పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. బాధితురాలు చట్టపరమైన న్యాయం మాత్రమే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘ప్యారడైజ్‌’ టికెట్‌ధరల పెంపు మెమోను వెనక్కి తీసుకోవాలి
‘కోడ్‌’ పడితే.. పని అయిపోయినట్లే!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 05:20 AM