‘కోడ్’ పడితే.. పని అయిపోయినట్లే!
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:31 AM
ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్సు కోసం ఆర్‌టీఏ ఆఫీసుకు వచ్చారు. ఏజెంట్‌తో కలిసి లోపలికి వెళ్లి దరఖాస్తు ఫారం ఇచ్చారు.. ఆఫీసు సిబ్బంది ఆ దరఖాస్తు తీసుకుని ఒక ప్రత్యేక గుర్తు వేశారు..
ఆర్‌టీఏ కార్యాలయాల్లో వసూళ్ల కోసం అధికారులు, సిబ్బంది వినూత్న మార్గం
ఏజెంట్ల ద్వారా వచ్చే వారి
దరఖాస్తులపై ప్రత్యేక గుర్తులు, పేర్లు!
వివరాలు సరిగా లేకున్నా..
నిబంధనలు పాటించకున్నా..
వేగంగా పనిపూర్తి.. ఎవరి వాటా వారికి!
బండ్లగూడ ఆర్‌టీఏ కార్యాలయంలో
తనిఖీల్లో గుర్తించిన ఏసీబీ అధికారులు
ఏజెంట్ల వద్ద 24,670 నగదు స్వాధీనం
అనుమానాస్పద యూపీఐ లావాదేవీలు
33దరఖాస్తులు మాయం చేసిన సిబ్బంది
గతంలోనూ పలుమార్లు అక్రమాల గుర్తింపు
అయినా బాధ్యులపై చర్యలు శూన్యం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్సు కోసం ఆర్‌టీఏ ఆఫీసుకు వచ్చారు. ఏజెంట్‌తో కలిసి లోపలికి వెళ్లి దరఖాస్తు ఫారం ఇచ్చారు.. ఆఫీసు సిబ్బంది ఆ దరఖాస్తు తీసుకుని ఒక ప్రత్యేక గుర్తు వేశారు.. అంతే.. దరఖాస్తులో ఏదైనా సరిగా లేకున్నా.. నిబంధనలు పాటించకున్నా.. ప్రక్రియ అంతా శరవేగంగా పూర్తయిపోయింది. ఏజెంట్ నుంచి సదరు అధికారికి వాటా కూడా చేరిపోయింది. రవాణా శాఖ కార్యాలయాల్లో సాధారణంగా మారిపోయిన తంతుకు చిన్న ఉదాహరణ ఇది. హైదరాబాద్‌లోని బండ్లగూడ ఆర్‌టీఏ ఆఫీసులో చేసిన తనిఖీల్లో ఏసీబీ అధికారులు ఇలాంటి వ్యవహారాలెన్నో గుర్తించారు. మంగళవారం రెండో రోజు కూడా కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.
కొందరు ఉద్యోగుల సెల్‌ఫోన్లలో అనుమానాస్పద యూపీఐ లావాదేవీలను గుర్తించారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు బి.సునీత, ఎన్.హేమంత్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్లు మహ్మద్ ఇమ్రాన్, కె.సాయికుమార్, జూనియర్ అసిస్టెంట్లు కె.బాబూజీ, ఎంఏ లతీ్‌ఫఖాన్, టి.శ్రీకాంత్ తదితరులు ఏజెంట్లు తీసుకొచ్చే దరఖాస్తులపై ప్రత్యేక గుర్తులు, పేర్లు రాసి వేగవంతంగా పరిశీలన పూర్తయ్యేలా సహకరిస్తున్నట్టు గుర్తించామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. తనిఖీల సమయంలో కార్యాలయంలో ఏజెంట్లు, ఆఫీ్‌సతో సంబంధం లేని వ్యక్తులు కొందరున్నారని.. ఏజెంట్ల వద్ద రూ.24,670 నగదు గుర్తించామని తెలిపారు. సీనియర్ అసిస్టెంట్ సాయికుమార్, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ 33 దరఖాస్తులను మాయం చేసినట్టు తేల్చారు. బండ్లగూడ ఆర్‌టీఏ ఆఫీసులో కొందరు ఉద్యోగులు దీర్ఘకాలంగా పనిచేస్తున్నారని.. భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలకు ఇదీ ఒక కారణమన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ ఎంఏ లతీ్‌ఫఖాన్ మధ్యలో స్పల్పకాలం ఇతర ప్రాంతాలకు బదిలీ అయినా.. 20 ఏళ్లుగా అదే కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నట్టు గుర్తించామని ఏసీబీ అధికారులు వెల్లడించడం గమనార్హం.
ఏసీబీ గుర్తించినా ఆర్‌టీఏ చర్యలేవి?
గతంలో ఉప్పల్, నాగోల్, మలక్‌పేట, కొండాపూర్, మేడ్చల్, తిరుమలగిరి రవాణాశాఖ ఆఫీసుల్లో జరిగిన ఏసీబీ తనిఖీల్లో ఏజెంట్ల ద్వారా వసూళ్లు చేస్తున్నట్టు తేల్చారు. వారికి ఇంక్రిమెంట్, పదోన్నతులు నిలిపివేయ డం వరకే పరిమితమవుతున్నారు. కొందరి విషయంలో ఆ చర్యలూ తీసుకోవడం లేదని ఉద్యోగవర్గాలే అంటున్నాయి. తాజాగా బండ్లగూడ ఆర్‌టీఏ ఆఫీ్‌సలో నగదు లెక్కిస్తున్న వీడియో ఆధారంగా ఆర్‌టీఓ రాంచందర్, ఎంవీఐ భీమ్‌సింగ్, కానిస్టేబుల్ అరుణ్‌లను సస్పెండ్ చేశారు. ఏసీబీ నుంచి అధికారికంగా నివేదిక వచ్చాక, విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంజీఎంలో మళ్లీ ఊడిన పైకప్పు పెచ్చులు!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News