Share News

అనని మాటలు కాదు.. కాంగ్రెస్‌ నేతలు అన్నమాటలే

ABN , Publish Date - Sep 23 , 2026 | 06:16 AM

బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మరోసారి ‘ఆంధ్రజ్యోతి’పై తన అక్కసు వెళ్లగక్కారు. కాంగ్రెస్‌ నేతలు తనను అనని మాటలను కూడా అన్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ రాసిందని అభాండాలు వేశారు.

అనని మాటలు కాదు.. కాంగ్రెస్‌ నేతలు అన్నమాటలే
Telangana Political Controversy

  • జగదీశ్‌రెడ్డిపై వారి వ్యాఖ్యలనే ప్రచురించిన ‘ఆంధ్రజ్యోతి’

  • వారేమన్నారో యూట్యూబ్‌లోనూ ఉంది

  • అవేమీ చూడకుండానే ‘ఆంధ్రజ్యోతి’పై జగదీశ్‌రెడ్డి అభాండాలు

  • ప్రత్యర్థుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పత్రికపై అక్కసు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మరోసారి ‘ఆంధ్రజ్యోతి’పై తన అక్కసు వెళ్లగక్కారు. కాంగ్రెస్‌ నేతలు తనను అనని మాటలను కూడా అన్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ రాసిందని అభాండాలు వేశారు. కాంగ్రెస్‌ నేతలు చేసిన ఆరోపణల్నే ఆంధ్రజ్యోతి ప్రచురించగా.. ఆయన మాత్రం వారికి సమాధానం చెప్పకుండా పత్రిక యాజమాన్యంపై నిందలు వేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల బృందం సోమవారం మద్దూరులోని జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌ వద్దకు వెళ్లి అక్కడ భూములను, రెవెన్యూ రికార్డులను పరిశీలించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా వారు చేసిన వ్యాఖ్యలను ఇతర మీడియాల మాదిరిగానే ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో, సోషల్‌మీడియాలో పదిలంగా ఉన్నాయి. కానీ, జగదీశ్‌రెడ్డి కనీసం అక్కడ వారేం మాట్లాడారో కూడా చూడకుండానే ఎవరో చెప్పారంటూ పత్రికపై చిందులు తొక్కారు. ఆయన చూడకపోయినా.. ఫాంహౌస్‌ వద్ద కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి ఏం మాట్లాడారో యథాతథంగా మళ్లీ ఇస్తున్నాం..


ఇన్ని రూ.కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?: ఎంపీ చామల

‘‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫాంహౌస్‌ పర్యటనలకు ఎందుకు వెళుతున్నారని కొందరు ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో దోపిడీని ప్రశ్నించి ప్రజలకు వివరించేందుకే ఈ పర్యటనలు చేస్తున్నాం. వాస్తవాలు తెలిపేందుకే ఇక్కడకు వచ్చాం. ఇక్కడ ఎంత బ్రహ్మాండమైన భవంతి ఉందో మరి. ఇది ఎవరిది? ఈ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిది కాదు. మొదటినుంచి నయా నవాబ్‌ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు మిక్సాలజి్‌స్టది. మిక్సాలజిస్ట్‌ అంటే మిక్సింగ్‌ మందు బాగా కలిపేవారు. విదేశాల్లో మిక్సాలజిస్ట్‌ అనేది చాలా పెద్ద పదం. ఎందుకంటే సాయంత్రం పూట కాక్‌టెయిల్‌ పార్టీల్లో బాగా కాక్‌టెయిల్‌ కలిపేటోళ్లకు ఎక్కువ జీతాలుంటాయి. ఈ మిక్సాలజిస్ట్‌ సోడా వాటర్‌ మిక్స్‌ంగ్‌ తోటి పెద్ద నవాబును ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన మెప్పు పొంది 2009లో మొదటిసారి హుజూర్‌నగర్‌లో ఎలక్షన్‌లో నిలబడ్డాడు.


అప్పట్లో ఆయన ఆస్తులన్నీ కలిపి రూ.12 లక్షలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో చూపించాడు. తరువాత 2014నాటికి మరింత పెరిగాయి. 2023నాటికి రూ.కోట్లలో ఆస్తులు వచ్చాయి. మద్దూరు సర్వే నంబరు 163, 223లో 50 ఎకరాల్లో ఫాంహౌస్‌ ఉంది. ఎక్కడ సూర్యాపేట? ఎక్కడ షాబాద్‌? అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ ఇక్కడకు తీసుకువచ్చి దాచిపెట్టుకున్నడు. ఆ ఆస్తులన్నీ ఎలా వచ్చాయో తెలంగాణ సమాజానికి చెప్పాలి. నయా నవాబు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు మిక్సాలిజిస్టు జగదీశ్‌రెడ్డి తన నియోజకవర్గంలోనే కాకుండా హైదరాబాద్‌ సమీపంలో కూడా ఫాం హౌస్‌లు సంపాదించుకున్నారు. పేదలకు దానం ఇచ్చిన భూములనూ వదల్లేదు. ఈ ఫాంహౌస్‌లో ఉన్న ఇనాం భూములను స్వాధీనం చేసుకోవాలి. ఇక్కడ ఇంకా అసైన్డ్‌ భూమి తీసుకునేందుకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారట. సెట్‌ కాక వదిలేశారని స్థానికులు చెబుతున్నారు’’ అని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.


నాడు రెండు దున్నపోతులు.. మూడెకరాలు: ఎమ్మెల్యే సామేలు

‘‘జగదీశ్‌రెడ్డి పుట్టిన ఊరు, నేను పుట్టిన ఊరు ఒకటే. అది తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలంలో ఉంది. ఆయనకు అప్పట్లో ఆస్తి ఏముందంటే.. ఎమ్మెల్యే కాకముందు రెండు దున్నపోతులు, మూడు ఎకరాల చెలక భూములు. దాంతోనే ఆయన కథ నడిచింది. అయితే ఇప్పుడు చూసేసరికే ఆడ 110ఎకరాలు జమ చేశాడు. వాళ్ల అత్తగారి ఊరు మునుగోడు మండలం ఇబ్బర్తి కాడ పోతారం పోయే రూట్లలో 70 నుంచి 80 ఎకరాలు చిట్కాయించాడు. ఆ తర్వాత వాళ్ల ఊర్లో మాదిగోళ్లు తోలు సాపు చేసుకునే తోళ్లమడిని వాళ్ల అయ్య ఆక్రమించుకున్నడు. తరువాత వాళ్ల తమ్ముని పేరు మీద ధరణిని అడ్డుపెట్టుకుని సురాయకుంటను కబ్జా చేసిండు.


వాళ్ల అయ్య రామచంద్రారెడ్డి వెనుకటి పట్వారీ. ఇప్పుడు నాగారం ఊరు సర్పంచి. అక్కడ కూడా మొత్తం కబ్జా చేసుకున్నరు. అక్కడ నల్లచెరువు అని ఉంటది. ఇది జగదీ్‌షరెడ్డి నాయన, వారి పెదనాయన పిచ్చిరెడ్డి మధ్య ఉండేది. పిచ్చిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నారు. వాళ్లిద్దరి మధ్యలో ఉండే నల్లచెరువును చిన్నగా ఖతం పెట్టారు. దాన్ని ఇయ్యాల దాదాపు 75శాతం ఆక్రమించుకున్నాడు. అక్కడ లంబాడ తండా పిచ్చిరెడ్డి తండా ఒకటి ఉంటది. పాపం వాళ్లకు కూడా ఈయన అన్యాయం చేశాడు. జగదీ్‌షరెడ్డికి ఇక్కడ 50 ఎకరాల భూమి ఉంది. జగదీ్‌షరెడ్డికి ఈ మద్దూరులో 11 లేదా 12 ఎకరాలు ఇనాం భూములు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి’’ అని మందుల సామేలు అన్నారు.


పవర్‌ ప్రాజెక్టుల్లో దోచుకొని.. ఫాంహౌస్‌లు: ఎమ్మెల్సీ బల్మూరి

‘‘జగదీశ్‌రెడ్డి 2014 ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ.12 లక్షల ఆస్తులు ఉన్నాయని క్లియర్‌గా ప్రకటించారు. కానీ, 2023 ఎన్నికల అఫిడవిట్‌ చూస్తే ఎన్నో రెట్లు ఆస్తులు పెరిగాయి సూర్యాపేట మొదలు పెడితే షాబాద్‌తోపాటు కర్ణాటకలోని హంపి, బీదర్‌ ఫాంహౌ్‌సలు ఉన్నాయి. మన రాష్ట్రం విడిచిపెట్టి పక్కన కర్ణాటక రాష్ట్రంలో కూడా ఆస్తులు సంపాదించారు. గతంలో హంపి రిసార్ట్‌లో నీ కొడుకు బర్త్‌డే రోజు ఏం మాటలు మాట్లాడినవో గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటది. విద్యుత్‌ మంత్రిగా ఉన్నప్పుడు పవర్‌ పర్చేస్‌ ద్వారా కోట్లు గడిం చావు. ఈ రోజు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మీరు అక్రమంగా కొల్లగొట్టిన భూముల ను పేదలకు పంచుతాం’’అని బల్మూరి అన్నారు.


పీకడానికే వచ్చాం: అద్దంకి

‘‘నా ఫాంహౌ్‌సకు ఏం పీకుతానికి పోయారని జగదీశ్‌రెడ్డి అంటున్నడు. అవును.. తిన్నవన్నీ పీకడానికే ఇక్కడకు వచ్చాం. మీ పేర్లమీదే ఇన్ని ఇంటే మీ బినామీల పేరుమీద ఎన్ని ఉన్నాయో బయటకు తీస్తాం. భూములు కొల్లగొట్టడానికి తెలంగాణ తెచ్చుకున్నామనే రీతిలో వ్యవహరిస్తున్నారు. అక్రమాలన్నింటినీ ప్రజల ముందు పెడతాం’’అని అద్దంకి దయాకర్‌ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫైర్‌ సేఫ్టీపై నిర్లక్ష్యానికి వైద్యమేది?
ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు..!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 06:17 AM