ఫైర్ సేఫ్టీపై నిర్లక్ష్యానికి వైద్యమేది?
ABN , Publish Date - Sep 23 , 2026 | 06:06 AM
అత్యవసర చికిత్సతో ప్రాణం నిలబడుతుందనే తపనతో రోగులను ఆస్పత్రులకు తరలించిన వారి ఆప్తులకు ఓ ఆందోళన వెంటాడుతోంది. ఎక్కడా అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే పరికరాలు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే .. రోగుల భద్రత గాల్లో దీపమే
ఫైర్ అలారం, స్ర్పింక్లర్లు, ఎగ్జిట్‌లపై నిర్లక్ష్యం
ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువుల మృతితో ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ఆందోళన
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అత్యవసర చికిత్సతో ప్రాణం నిలబడుతుందనే తపనతో రోగులను ఆస్పత్రులకు తరలించిన వారి ఆప్తులకు ఓ ఆందోళన వెంటాడుతోంది. ఎక్కడా అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే పరికరాలు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పరికరాలు ఉన్నా అవి పనిచేయకపోవడం, అత్యవసర మార్గాలు అందుబాటులో లేకపోవడం వంటి లోపాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఐసీయూ, ఎన్‌ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, ఆక్సిజన్ నిల్వచేసే ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా భద్రతాచర్యలు తీసుకోవడం అత్యంత కీలకం. తాజాగా ఆదిలాబాద్ రిమ్స్‌లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్నిప్రమాదంలో శిశువులు మృతి చెందిన ఘటనతో ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైంది.
ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ప్రైవేటు ఆస్పత్రులతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఫైర్‌సేఫ్టీపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో గత ఏప్రిల్‌లో 200లకుపైగా ఆస్పత్రుల్లో అగ్నిమాపక శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. తప్పనిసరిగా తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించలేడం లేదని గుర్తించి నోటీసులు జారీ చేసింది. సుమారు 800 ఆస్పత్రుల్లో ఫైర్ అలారాలు, స్మోక్ డిటెక్టర్లు, ఆటోమేటిక్ స్ర్పింక్లర్లు, హోస్ రీల్స్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, అత్యవసర ద్వారాలు సరిగా పనిచేసే స్థితిలో లేకపోవడం, ఉన్నవాటికి తాళాలు వేయడం తదితర అంశాల్లో లోపాలు వెలుగుచూశాయి. కొన్ని ఆస్పత్రుల్లో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు ఉన్నప్పటికీ అవి సరిగా నిర్వహించకపోవడం (సర్వీసింగ్ చేయకపోవడం), వినియోగానికి సిద్థంగా లేకపోవడం వంటి లోపాలను అగ్నిమాపకశాఖ అధికారులు తనిఖీల్లో గుర్తించారు.
అత్యవసర ద్వారాలు అలంకారప్రాయమే..
ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగిన సమయంలో రోగులు, వారి సహాయకులు, వైద్య సిబ్బంది బయటకు వెళ్లేందుకు అత్యవసర నిష్క్రమణ మార్గాలు కీలకం. కొన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు మూసివేయడం లేదా ఇతర వస్తువులతో నింపివేయడం వంటి సమస్యలున్నట్లు తనిఖీల్లో తేలింది. ఆస్పత్రుల్లోని రోగుల్లో పెద్ద సంఖ్యలో నడవలేని వారు, ఐసీయూ రోగులు, శిశువులు, వృద్థులు ఉండటంతో సాధారణ భవనాలతో పోలిస్తే.. ఇక్కడ తరలింపు ప్రక్రియ మరింత క్లిష్టంగా ఉంటుంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య వాయువుల నిల్వ ప్రాంతాలు అత్యంత సురక్షితంగా ఉంచాలి. అయితే కొన్ని చోట్ల బేస్‌మెంట్ ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్లు నిల్వ చేయడం, విద్యుత్తు సర్క్యూట్లపై అధిక భారం వేయడం వంటి ప్రమాదకర పరిస్థితులను కూడా తనిఖీల్లో గుర్తించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.
ఎన్‌వోసీ పొందితే అన్నీ మరిచిపోతున్నారు
ఫైర్‌సేఫ్టీ ఎన్‌వోసీ పొందడం ఒకదశ మాత్రమే. తెలంగాణ ఫైర్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ప్రొవిజనల్ ఎన్‌వోసీ, ఆక్యుపెన్సీ ఎన్‌వోసీ, అనంతరం రెన్యువల్ ఎన్‌వోసీ వంటి దశలు ఉన్నాయి. నిర్మాణం పూర్తయ్యాక సూచించిన అగ్ని భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేశారా.. లేదా? అన్నది పరిశీలించాక ఆక్యుపెన్సీ ఎన్‌వోసీ జారీ చేస్తారు. ఆయా దశల్లో ఎన్‌వోసీలు పొందుతున్న ఆస్పత్రులు ఆ తర్వాత అన్ని భద్రతా ప్రమాణాలను మరిచిపోతున్నారు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం తప్పడం లేదు. ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని ఎప్పటికప్పుడు పనిచేసే స్థితిలో ఉంచాల్సిన బాధ్యత ఆస్పత్రి యాజమాన్యాలపై ఉంటుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల్లోనూ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన యాక్టివ్ ఫైర్ సిస్టమ్స్‌ను ఆపరేషనల్ స్థితిలో ఉంచేందుకు క్రమబద్ధమైన నిర్వహణ, శిక్షణ పొందిన సిబ్బంది, ఫైర్ ేసఫ్టీ ఏర్పాట్ల పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు.
నిమ్స్ మాక్‌డ్రిల్‌లో బయటపడ్డ డొల్లాతనం
మాక్‌డ్రిల్‌లో భాగంగా నిమ్స్ ఆస్పత్రిలో అగ్నిమాపక శాఖ నిర్వహించిన మాక్ డ్రిల్‌లో అత్యవసర సమయంలో ఆస్పత్రి సిబ్బంది స్పందించే తీరులోని లోపాలు బయటపడ్డాయి. ఫైర్‌సిబ్బంది మాక్‌డ్రిల్‌కు సంబంధించి రోగులు, సహాయకులకు ఎలాంటి సమాచారం అందించలేదు. డ్రిల్ మొదలవ్వగానే ఆస్పత్రిలోని ఓ ఏడంతస్తుల బ్లాక్‌లో ఫైర్ అలారం ఒక్కసారిగా మోగింది. విషయం తెలియని రోగులు, సహాయకులు ప్రమాదం జరిగిందని భావించి భయాందోళనకు గురయ్యారు. లిప్ట్ పనిచేయకపోవంతో ఆపరేషన్ చేసుకున్న రోగులు, వారి సహాయకులు ఏడంతస్తులు మెట్లమార్గంలో కిందకు దిగొచ్చారు. ఆ తర్వాతగానీ అది ప్రమాదం కాదు, మాక్‌డ్రిల్ అని తెలియలేదు. మాక్‌డ్రిల్‌లోనే సిబ్బంది అవగాహనారాహిత్యం బహిర్గతమైన పరిస్థితుల్లో ప్రమా దం జరిగితే పరిస్థితి ఏమిటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News