Share News

అమ్ముకునేందుకే ఆయుధాల చోరీ!

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:44 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసు నిందితుడు మల్లేశ్‌.. ఆయుధాలను సంఘ విద్రోహశక్తులకు విక్రయించాలని ప్రయత్నించినట్లు సమాచారం. ఆయుధాలు కొనుగోలు చేసే వ్యక్తుల కోసం ఇంటర్నెట్‌లో, సోషల్‌ మీడియాలో తీవ్రంగా వెతికినట్లు వెల్లడైంది.

అమ్ముకునేందుకే ఆయుధాల చోరీ!
Army Arms Theft Case

  • కొనే వారి కోసం సోషల్‌ మీడియాలో వెదుకులాట

  • ఆర్మీ ఆయుధాల చోరీ నిందితుడు మల్లేశ్‌ విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి

  • తొలి రోజు 6 గంటలు ప్రశ్నించిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసు నిందితుడు మల్లేశ్‌.. ఆయుధాలను సంఘ విద్రోహశక్తులకు విక్రయించాలని ప్రయత్నించినట్లు సమాచారం. ఆయుధాలు కొనుగోలు చేసే వ్యక్తుల కోసం ఇంటర్నెట్‌లో, సోషల్‌ మీడియాలో తీవ్రంగా వెతికినట్లు వెల్లడైంది. ఆర్మీ మాజీ హవల్దార్‌ మల్లేశ్‌ను 10 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో.. మంగళవారం పోలీసులు అతడిని చంచల్‌గూడ జైలు నుంచి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బేగంపేట పరిధిలోని ఓ ప్రాంతానికి తరలించి మల్లేశ్‌ను విచారిస్తున్నట్లు తెలిసింది. తొలిరోజు సుమారు 6 గంటల పాటు అతడిని ప్రశ్నించి పలు వివరాలు రాబట్టారు.


తనను ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులపై కక్షతోనే మల్లేశ్‌ ఆయుధాల చోరీకి పథకం పన్నాడని గుర్తించినట్లు తెలుస్తోంది.ఆర్మీ బెటాలియన్‌లో ఆయుధాగారం, తూటాలు భద్రపరిచే గది వద్ద భద్రతా విధుల్లో ఉండే తన స్నేహితులతో మల్లేశ్‌ తరచూ ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. మద్రాస్‌ రెజిమెంట్‌లో సీసీటీవీ కెమెరాలను ఎప్పుడు ఆఫ్‌ చేస్తున్నారంటూ ఆరాతీసినట్లు తెలుస్తోంది. చోరీకి ముందు మూడు రోజులపాటు 20 మద్రాస్‌ రెజిమెంటులోకి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించాడని తెలిసింది. మల్లేశ్‌ చేసిన చోరీ వెనుక అతడి మాజీ సహచరుల పాత్ర ఏ మేరకు ఉంది? మల్లేశ్‌ను వారు ఎందుకు అనుమానించలేదు? వంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మల్లేశ్‌ ఫోన్‌లోని డేటాను, సోషల్‌ మీడియాలో అతడి సెర్చ్‌ హిస్టరీని సైబర్‌ సెక్యూరిటీ, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సేకరించినట్లు తెలిసింది. ఈ వివరాల ఆధారంగానే పోలీసులు మల్లేశ్‌ను విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు
4 జిల్లాలకు వరదముప్పు
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 05:44 AM