Share News

నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:28 AM

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా బుధ, గురువారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు
Telangana Rain Alert

  • 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ

  • అధికారులూ.. అప్రమత్తంగా ఉండండి

  • అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ ఆదేశం

  • పిడుగుపాటుకు యాదాద్రిలో మహిళ మృతి

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా బుధ, గురువారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంటూ.. వాటికి ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.


ఇక, గురువారం కూడా ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి , మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. కాగా, ఈ నెల 26 వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం నాగారం (తొరమామిడి)లో 5.6 సెం.మీ, నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో 4 సెం.మీ, డొంకేశ్వర్‌లో 2.5 సెం.మీ, ఏర్గట్లలో 2.48 సెం.మీ, మగ్గిడిలో 2.13సెం.మీ, నల్లగొండ జిల్లా గుండ్లపల్లిలో 2.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెంలో పిడుగుపాటుకు మహిళ మృతి చెందింది. సింగరి పద్మ (45) వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా.. వర్షం రావడంతో ఓ చెట్టు కింద నిలబడింది. సమీపంలో పిడుగు పడడంతో ప్రాణాలు కోల్పోయింది.


కాగా, హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో అనేక ప్రాంతాల్లో రహదారులు ముంపునకు గురై.. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. హిమాయత్‌నగర్‌ విఠల్‌వాడిలో 3.2, కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో 2.8 సెం.మీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, లకిడీకపూల్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అఽధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ పరిధిలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు సమన్వయంతో పని చేస్తూ పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో వెంటనే సిబ్బంది, యంత్రాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘ప్యారడైజ్‌’ టికెట్‌ధరల పెంపు మెమోను వెనక్కి తీసుకోవాలి

అన్నేళ్లు లైంగిక వేధింపులు ఎందుకు భరించారు?

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 05:29 AM