Share News

మట్టికుండ నీళ్లు.. మజానే వేరు

ABN , Publish Date - Feb 24 , 2026 | 10:03 AM

వేసవి కాలంలో మట్టి కుండలోని నీటిని తాగడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. ఫ్రిజ్‌ నీళ్ల కంటే కూడా మట్టి కుండలోని నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

మట్టికుండ నీళ్లు.. మజానే వేరు

  • వేసవిలో కుండ నీరు తాగడానికే మొగ్గు చూపుతున్న ప్రజలు

  • ఆరోగ్యానికి మేలంటున్న వైద్యులు

అల్వాల్‌(హైదరాబాద్): వేసవి కాలంలో మట్టి కుండలోని నీటిని తాగడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. ఫ్రిజ్‌ నీళ్ల కంటే కూడా మట్టి కుండలోని నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒకప్పుడు మట్టికుండలతో వంటకాలు చేసుకునే వారు. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలుగా ఉండేది. మట్టి కుండల్లో తయారైన భోజనాన్ని రుచి చూసిన ఆనాటి తరం వారు ఆరోగ్యంగా జీవించారు. కాలక్రమేణా మట్టి కుండల్లో వంటకాలు కనుమరుగయ్యాయి. అయితే కుండ నీటికి మాత్రం ఆదరణ తగ్గలేదు. రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఒక వైపు పర్యావరణ నిపుణులు, వైద్యులు మట్టికుండలోని నీటిని తాగడంతో పోషక విలువలతో ఆరోగ్యానికి మేలవుతుందని చెబుతున్నారు.


కుమ్మరిబస్తీ కుండలకు భలే గిరాకీ

అల్వాల్‌ కుమ్మరిబస్తీలో తయారు చేసే మట్టి కుండలకు స్థానికంగా మంచి డిమాండ్‌ ఉంది. వేసవి కాలంలో వీటికి మరింత గిరాకీ పెరుగుతుంది. చాలా మంది ఈ వేసవిలో మట్టి కుండలోని నీటిని తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నీరు మరీ చల్లగా ఉండకుండా తాగేందుకు అనుకూలంగా ఉండటమే ప్రధాన కారణం. శీతోష్ణస్థితి ఆధారంగా మట్టి కుండలు నీటిని చల్లబరుస్తాయి.


కుండలోని రకాలు

కుండలు, రంజన్‌ బిందెలు, కూజలు, జమాల్‌ తదితర కుండలు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఒక్కో కుండ 10, 20, 30 లీటర్ల సామర్థ్యం ఉంటాయి. వీటి ధర మార్కెట్లో రూ.200 నుంచి రూ.300, రూ.500 వరకు ఉంటుంది. వాటితో పాటు కూరలు, అన్నం వండే వంట పాత్రలతో పాటు పెరుగు కోసం కూడా ప్రత్యేక పాత్రలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. కాగా రంజన్‌ వంటి వాటిని మాత్రం ఇక్కడ తయారుచేయడం లేదు. అయితే ఇక్కడ తయారుచేసిన మట్టి కుండలను సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాలకు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తుంటారు.


city6.2.jpgగతంతో పోల్చితే తగ్గిన వ్యాపారం

గతంలో అల్వాల్‌లోని చెరువుల్లోనే మంచి బంకమట్టి లభించేది. ఈ మట్టిని తీసుకవచ్చి కుండలను తయారు చేసేవారు. అయితే ప్రస్తుతం అల్వాల్‌ పరిసర ప్రాంతాల్లోని చెరువులు కాలుష్య బారినపడటంతో నాణ్యమైన బంకమట్టి లభించడంలేదు. దీంతో సిద్దిపేట్‌, మెదక్‌ దూరప్రాంతాల్లోని చెరువుల నుంచి బంకమట్టిని తీసుకొచ్చి కుండలను తయారుచేయడం కుమ్మరి కులస్థులకు కష్టంగా మారింది. దీనికి తోడు వీటిని కాల్చడానికి కావల్సిన కట్టెల ధరలు కూడా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.


city6.3.jpgనాణ్యమైన బంకమట్టి దొరకక ఇబ్బందులు

'ప్రస్తుతం.. కుండలను తయారుచేసి విక్రయించడం కష్టంగా మారింది. కుండల తయారీకి ప్రత్యేకంగా బంకమట్టిని ఉపయోగిస్తాం. అయితే చెరువులు పూర్తిగా కలుషితం కావడంతో ఇక్కడి బంకమట్టితో కుండలు తయారీ చేయలేకపోతున్నాం. నాణ్యమైన బంకమట్టి కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. సిద్దిపేట్‌, మెదక్‌ నుంచి ట్రాలీలో తీసుకొస్తున్నాం. దీంతో రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. దానికి తోడు కుండలను కాల్చడానికి కావల్సిన కట్టెల ధరలు కూడా పెరిగాయి. అయినా కులవృత్తులను వదులుకోకుండా వ్యయప్రయాసాలతో అన్నం, కూరలు వండే పాత్రలను కూడా తయారు చేస్తున్నాం.'

- వీరేశం, కుమ్మరి బస్తీ, అల్వాల్‌


ఈ వార్తలు కూడా చదవండి:

ఆత్మహత్య చేసుకోవాలని ట్యాంక్‌బండ్‌కు..

ఏఐతో సైబర్‌ మోసాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 24 , 2026 | 10:24 AM