Share News

జార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. పేషెంట్‌ సహా ఏడుగురి మృతి

ABN , Publish Date - Feb 24 , 2026 | 09:24 AM

జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్రా జిల్లా అడవుల్లో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. 65 శాతం కాలిన గాయాలతో ఓ రోగిని ఢిల్లీకి తరలిస్తుండగా ఈ విషాదం నెలకొంది. ప్రమాదంలో పేషెంట్ సహా ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, డాక్టర్, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

జార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. పేషెంట్‌ సహా ఏడుగురి మృతి
Jharkhand air ambulance crash

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 24: జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఛత్రా జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాంచీ నుంచి ఢిల్లీకి రోగిని తరలిస్తున్న ఓ ఎయిర్ అంబులెన్స్ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పేషెంట్‌తో సహా ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మెరుగైన చికిత్స కోసం వెళ్తుండగా విషాదం

రాంచీలోని దేవ్‌కమల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజయ్ కుమార్(41) అనే వ్యక్తికి 65 శాతం శరీరం కాలిపోయింది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు కుటుంబ సభ్యులు ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం 7:11 గంటలకు రాంచీ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘోరం జరిగింది.

ప్రమాద వివరాలు..

రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ C90 (VT-AJV) విమానం ఛత్రా జిల్లాలోని సిమారియా సమీపంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. గాలిలో ఉన్నప్పుడు వాతావరణం అనుకూలించకపోవడం(పిడుగులు, భారీ వర్షం) వల్ల విమానం నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. రాత్రి 7:34 గంటలకు కోల్‌కతా ఏటీసీతో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. దాదాపు 10:00 గంటల సమయంలో సహాయక బృందాలు మృతదేహాలను గుర్తించాయి.


మరణించిన వారి వివరాలు..

ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, ఒక రోగి, ఒక డాక్టర్, ఒక పారామెడిక్, ఇద్దరు రోగి తరఫు బంధువులు ఉన్నారు.

1. కెప్టెన్ వివేక్ వికాస్ భగత్ (పైలట్)

2. కెప్టెన్ సవరాజ్‌దీప్ సింగ్ (కో-పైలట్)

3. సంజయ్ కుమార్ (రోగి)

4. డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా

5. సచిన్ కుమార్ మిశ్రా (పారామెడిక్)

6. అర్చనా దేవి

7. ధూరు కుమార్

దర్యాప్తునకు ఆదేశం

ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) లోతైన విచారణకు ఆదేశించాయి. ప్రతికూల వాతావరణమే కారణమా లేక సాంకేతిక లోపమా అనేది బ్లాక్ బాక్స్ లభ్యమయ్యాక స్పష్టత రానుంది.


ఇవి కూడా చదవండి..

పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..

Updated Date - Feb 24 , 2026 | 09:43 AM