ప్రశ్నిస్తే అభియోగాలు.. సస్పెండ్ చేస్తామని బెదిరింపులు
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:48 AM
‘మా మీదే ఆర్టీఐ ప్రశ్నలు వేస్తావా.. నిన్నెందుకు సస్పెండ్ చేయకూడదు. వెంటనే సమాధానం చెప్పు. లేదంటే విచారణాధికారి ముందు హాజరై.. వివరణ ఇవ్వు’ అంటూ దేవదాయ శాఖలో...
ఉద్యోగిపై దేవదాయ శాఖ అధికారుల వేధింపులు
‘మా మీదే ఆర్టీఐ ప్రశ్నలు వేస్తావా.. నిన్నెందుకు సస్పెండ్ చేయకూడదు. వెంటనే సమాధానం చెప్పు. లేదంటే విచారణాధికారి ముందు హాజరై.. వివరణ ఇవ్వు’ అంటూ దేవదాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగిపై అధికారులు అభియోగాలు నమోదు చేశారు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాలు, అవినీతి వ్యవహారాలతోపాటు అక్రమ పదోన్నతులపై అనేకసార్లు ఆర్టీఐ ద్వారా సదరు ఉద్యోగి ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పలేకపోవడంతో అనేకసార్లు ఆర్టీఐ కమిషనర్ల వద్ద జరిగిన విచారణలో అధికారులకు మొట్టికాయలు పడ్డాయి. దీంతో అతనికి నాన్ ఫోకల్ సీటులో ఫోస్టింగ్ ఇచ్చారు. తాజాగా అతనిపై ఎనిమిది అభియోగాలు నమోదు చేశారు. వాటికి వెంటనే సమాధానం చెప్పాలని కోరారు. వివరణ ఇచ్చిన తర్వాత కూడా.. దానికి తాము సంతృప్తి చెందలేదని, విచారణాధికారిని నియమించారు. శుక్రవారం విచారణాధికారి ముందు వివరణ ఇవ్వాలని సోమవారం మరొక నోటీసు జారీ చేశారు. ఈ అభియోగాలు దేవదాయ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.