Share News

‘వాహన్‌’లో మరో 3 సేవలు!

ABN , Publish Date - Nov 08 , 2026 | 03:31 AM

వాహన్‌, సారధి పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఇప్పటికే పలు రకాల సేవలు అందిస్తున్న రవాణా శాఖ తాజాగా మరో మూడు సేవల్ని రవాణా శాఖ వాహన్‌ పోర్టల్‌కు అనుసంధానం చేసింది.

‘వాహన్‌’లో మరో 3 సేవలు!
Vahan Portal Update

  • యాజమాన్య బదిలీ, ఎన్‌ఓసీ, ఈ-కేవైసీ అప్‌డేట్‌..

  • ఆధార్‌ ఓటీపీతో ధ్రువీకరణ ద్వారా సేవలు

  • ఈ-కేవైసీలో వివరాలు తప్పుగా నమోదు చేస్తే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే

  • పైగా చెల్లించిన ఫీజు జప్తు: రవాణా శాఖ

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వాహన్‌, సారధి పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఇప్పటికే పలు రకాల సేవలు అందిస్తున్న రవాణా శాఖ తాజాగా మరో మూడు సేవల్ని రవాణా శాఖ వాహన్‌ పోర్టల్‌కు అనుసంధానం చేసింది. వాహన యాజమాన్య బదిలీ, ఇతర రాష్ట్రాలకు వాహనాన్ని తరలించేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ), వాహన యజమాని ఈ-కేవైసీ వివరాల అప్‌డేట్‌ సేవలను ఆధార్‌ ఆధారిత ఓటీపీ ఽధ్రువీకరణతో పూర్తి చేసుకోవచ్చు. నూతన విధానంతో వాహనదారులు ఆయా పనుల కోసం ఆర్‌టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. షోరూంలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్సుతోపాటు మరిన్ని సేవలను ఇప్పటికే వాహన్‌, సారధి పోర్టల్‌లో అందిస్తున్న విషయం విదితమే.


విక్రేత, కొనుగోలుదారు వేర్వేరుగా...

వాహన యాజమాన్య బదిలీ ప్రక్రియలో విక్రేత వాహన్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయి ఆర్‌సీ సంబంధిత సేవల్లో ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ఓనర్‌షిప్‌ (సెల్లర్‌)ను ఎంచుకోవాలి. వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు, చాసిస్‌ లేదా ఇంజిన్‌ నంబరు చివరి ఐదు అక్షరాలు, ఇన్సూరెన్స్‌ లేదా పీయూసీసీ గడువు తేదీతో వివరాలను ధృవీకరించాలి. ఆధార్‌ ఓటీపీ ధ్రువీకరణ అనంతరం కొనుగోలుదారు వివరాలు, సంబంధిత ఆర్‌టీఓ కార్యాలయాన్ని నమోదు చేయాలి. దీంతో అప్లికేషన్‌ నంబరు కొనుగోలుదారు మొబైల్‌కు చేరుతుంది. ఆ నంబరుతో కొనుగోలుదారు లాగిన్‌ అయి తన చిరునామా నమోదు చేసి, ఆధార్‌ ఓటీపీతో ధృవీకరణ పూర్తి చేయాలి. అనంతరం నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వాహన నివేదికను పరిశీలించి ఫీజు చెల్లించాలి. కొనుగోలుదారు, విక్రేత ఈ-సైన్‌ ప్రక్రియ పూర్తి చేసి తుది సమర్పణ చేసిన తర్వాత లావాదేవీ ఆటోమేటిక్‌గా ఆమోదం పొందుతుంది. కొత్త ఆర్‌సీని ఆర్‌టీఓ కార్యాలయం నుంచి పంపిస్తారు.


ఇతర రాష్ట్రాలకు వెళ్లినా.....

వాహనాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించాలనుకునే వారు లేదా అక్కడ విక్రయించాలనుకునే వారు ఎన్‌ఓసీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాహన్‌ పోర్టల్‌లో సిటిజన్‌ సర్వీసెస్‌ విభాగంలో ఎన్‌ఓసీ సేవను ఎంచుకుని వాహన వివరాలను నమోదు చేయాలి. ఆధార్‌ ఓటీపీతో ధ్రువీకరణ అనంతరం వాహనాన్ని ఇతర రాష్ట్రానికి తరలించే కారణాన్ని పేర్కొని ఎక్కడి పంపించాలనుకుంటున్నామో ఆ రాష్ట్రం పేరు, సంబంధిత ఆర్‌టీఓ వివరాలను నమోదు చేయాలి. అవసరమైన చోట బదిలీ పొందే వారి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్‌సీఆర్‌బీ ద్వారా వాహనంపై పోలీసు కేసులు, నేర రికార్డుల వివరాలతో నివేదికను పొందవచ్చు. ఫీజు చెల్లించిన అనంతరం ఫారం-28, ఎన్‌సీఆర్‌బీ నివేదికను డాక్యుమెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో అప్‌లోడ్‌ చేసి తుది దరఖాస్తు సమర్పించాలి. ఈ దరఖాస్తు సంబంధిత ఆర్‌టీఓ పరిశీలనకు వెళ్తుంది.


ఈ-కేవైసీ అప్‌డేట్‌ కూడా ఆన్‌లైన్‌లోనే..

వాహన యజమానులు తమ ఈ-కేవైసీ వివరాలను సైతం వాహన్‌ పోర్టల్‌ ద్వారా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. సిటిజన్‌ సర్వీసెస్‌లో వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు నమోదు చేసి, అడిషనల్‌ సర్వీసెస్‌లో ఈ-కేవైసీ అప్‌డేట్‌ సేవను ఎంచుకోవాలి. చాసిస్‌ నంబరు చివరి 5 అక్షరాలతో వాహనాన్ని ధ్రువీకరించిన అనంతరం ఆధార్‌ నంబరు లేదా వర్చువల్‌ ఆధార్‌ ఐడీ నమోదు చేయాలి. మొబైల్‌ నంబరుకు వచ్చే ఓటీపీతో ధృవీకరణ పూర్తి చేయాలి. వివరాలను పరిశీలించి సమర్పించిన తర్వాత రసీదు తీసుకుని ఆధార్‌ కార్డు కాపీ, ఆర్‌సీని అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం దరఖాస్తు సంబంధిత ఆర్‌టీఓ ఆమోదానికి వెళ్తుంది. అయితే, ఈ-కేవైసీ సేవలో ఒకసారి దరఖాస్తు సమర్పించిన తర్వాత వివరాలను సరిచేసుకునే అవకాశం ఉండదని రవాణా శాఖ స్పష్టం చేసింది. తప్పుగా నమోదు చేసిన దరఖాస్తును ఉపసంహరించుకుని కొత్తగా దాఖలు చేయాల్సి ఉంటుందని, అప్పటికే చెల్లించిన ఫీజు జప్తు అవుతుందని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

రావిర్యాల భూములు బ్లాక్‌లో

వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 03:31 AM