Mahesh Kumar Goud: వీబీ-జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలి: మహేశ్ కుమార్ గౌడ్
ABN , Publish Date - Jan 08 , 2026 | 01:43 PM
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ (వీబీ-జీ రామ్ జీ)పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్, జనవరి8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ-జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) షాకింగ్ కామెంట్స్ చేశారు. జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా గ్రామ సభలు ఏర్పాటు చేద్దామని సూచించారు. ఇవాళ(గురువారం) గాంధీ భవన్‌లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. వందేమాతరం గీతంతో ఈ సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు హాజరయ్యారు.
పునరుద్ధరించాలి..
ఈ సందర్భంగా జీ రామ్ జీ చట్టంపై చర్చించారు. అలాగే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం అజెండా రూపొందించారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కుట్రను నిరసిస్తూ తీర్మానం చేశారు. వీబీ జీ రామ్ జీ పథకాన్ని వెనక్కు తీసుకుని.. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు.
నిరసనలు ఉధృతం చేయాలి..
ఏఐసీసీ సూచన మేరకు జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకిస్తూ నిరసనలు ఉధృతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత 20 నుంచి 30వ తేదీల్లో అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. MANREGA చట్టం గొప్పతనం వివరిస్తూ ప్రతి నియోజకవర్గానికి ఐదు వేల చొప్పున కరపత్రాలు పంపిణీ చేయాలని మార్గనిర్దేశం చేశారు. ప్రతి కరపత్రం గ్రామాలు, వాడవాడకూ చేరాలని సూచించారు. విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఉపాధి హామీ పథకం గురించి ఆరా తీశారని పేర్కొన్నారు. ఈ పథకం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు.
జీ రామ్ జీ చట్టంతో పేదల హక్కు కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ డీసీసీలు గ్రామసభలు నిర్వహించి తీరాల్సిందేనని హుకుం జారీ చేశారు. జీ రామ్ జీ చట్టంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆయా జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. డీసీసీ పదవి బాధ్యతగలదని.. అన్ని కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించాలని మహేశ్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు.