15 రోజుల ఖర్చుతో నెలంతా ప్రయాణం
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:36 AM
రోజువారీ బస్సు ప్రయాణాన్ని మరింత పొదుపుగా, సౌకర్యంగా మార్చేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది.
మహిళలకు మెట్రో, రాజధాని బస్సుల్లో నెలవారీ పాస్
సాధారణ ప్రయాణికులకు కొత్తగా డీలక్స్ పాస్‌లు
2, 3 నెలల పాస్‌లకు అదనంగా 5, 10 రోజుల గడువు
నేటి నుంచే అమల్లోకి ఆర్టీసీ నూతన రాయితీలు
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : రోజువారీ బస్సు ప్రయాణాన్ని మరింత పొదుపుగా, సౌకర్యంగా మార్చేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది. సంస్థ నెలవారీ సీజన్ టికెట్ (ఎంఎ్‌సటీ)పథకం కింద అదనపు సౌకర్యాలు, ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఈ సవరించిన నిబంధనలు శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. మహిళా ప్రయాణికులలో సీజన్ టికెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వారికి సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోను అలాగే జిల్లాల్లో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అయితే మెట్రో, రాజధాని, డీలక్స్ బస్సుల్లో ప్రయాణించేందుకు మహిళలు టిక్కెట్, నెలవారీ పాస్ కొనుగోలు చేయాల్సిందే.
అలాంటి వారికోసం ప్రత్యేక రాయితీ ప్రవేశపెట్టింది. ఇకపై వారు ఈ బస్సుల్లో నెలవారీ రూట్ పాస్ కోసం 15 రోజులకు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు హైదరాబాద్-వరంగల్ రూట్ పాస్ ప్రస్తుతం చెల్లిస్తున్న రుసుములో సగం ధరకే ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుంది. పాస్ ధరలను మరింత తగ్గించే క్రమంలో టోల్ ప్లాజా చార్జీలను ప్రస్తుతం ఉన్న 25 రోజులకు బదులుగా ఇకపై 20 రోజులకు మాత్రమే లెక్కించనున్నారు. దీంతోపాటు సాధారణ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ ఎంపికను అందించేందుకు డీలక్స్ నెలవారీ సీజన్ టికెట్లను ఆర్టీసీ ప్రవేశపెడుతోంది. ఈ పాస్‌లు ‘ఇ-డీలక్స్’ సర్వీసులలో సైతం చెల్లుబాటవుతాయి. ఇక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ నగరాల్లో నెలవారీ సిటీ పాస్ కలిగిన వారికి ప్రత్యేక ప్రయోజనంగా.. అన్ని కేటగిరీల సిటీ బస్సు సర్వీసులలో ఆదివారాల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పించారు.
అయితే ఈ సౌకర్యం గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని పుష్పక్ ఎయిర్‌పోర్ట్ సర్వీసులకు, ఇతర ప్రభుత్వ సెలవు దినాలకు వర్తించదు. ప్రయాణికులకు మరింత సౌలభ్యం కోసం ‘కాంబి టికెట్’ను అందుబాటులోకి తెచ్చింది. దీని కింద ప్రతి ప్రయాణానికి అదనంగా రూ. 20 చెల్లించి కాంబి టికెట్ తీసుకోవడం వల్ల.. పల్లెవెలుగు మంత్లీ సీజన్ టికెట్ హోల్డర్స్ ఎక్స్‌ప్రెస్, ఇ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ, అలాగే ఎక్స్‌ప్రెస్ ఎంఎ్‌సటీ హోల్డర్లు డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. కాగా 2 నెలల సీజన్ టికెట్ తీసుకునే వారికి అదనంగా 5 రోజుల వ్యాలిడిటీ, 3 నెలల కోసం తీసుకునే వారికి అదనంగా 10 రోజుల వ్యాలిడిటీని సంస్థ కల్పిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News