Share News

‘రియల్‌’ సంస్థలపై రెరా కొరడా

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:10 AM

రెరా అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపట్టడం.. ప్లాట్లు, ఫ్లాట్లను కొనుగోలుదారులకు సకాలంలో అప్పగించకపోవడం.. ఇలా పలు రకాల ఉల్లంఘనలకు పాల్పడిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపై టీజీ రెరా కొరడా ఝుళిపించింది.

‘రియల్‌’ సంస్థలపై రెరా కొరడా
Telangana RERA

  • భువన్‌ తేజ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు నిలిపివేత

  • సనాలి ద ఎడ్జ్‌ సంస్థకు రూ.25 లక్షల జరిమానా

  • వాసవి రియల్టర్స్‌పై ఆగ్రహం

  • అనుమతులు లేకుండా విల్లాలు నిర్మిస్తున్న ఎస్‌వీఎం ఆదిత్య హోమ్స్‌ సహా పలు సంస్థలకు ఫైన్లు

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రెరా అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపట్టడం.. ప్లాట్లు, ఫ్లాట్లను కొనుగోలుదారులకు సకాలంలో అప్పగించకపోవడం.. ఇలా పలు రకాల ఉల్లంఘనలకు పాల్పడిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపై టీజీ రెరా కొరడా ఝళిపించింది. ఆయా సంస్థలకు జరిమానా, అపరాధ రుసుములు విధిస్తూ చైర్మన్‌ శ్రీనివాస్‌రాజునేతృత్వంలోని అథారిటీ మంగళవారం ఎనిమిది ఉత్తర్వులు ఇచ్చింది. రెరా రిజిస్ట్రేషన్‌ లేకుండానే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో సనాలి ది ఎడ్జ్‌ పేరుతో భారీ నివాస ప్రాజెక్టును చేపట్టి, ప్రచారం చేసి, కొనుగోలుదారుల నుంచి డబ్బులు సమీకరించిన సనాలి ఐటీ పార్క్స్‌పై రూ.25 లక్షల జరిమానా విధించింది.


ప్రాజెక్టుకు రెరా రిజిస్ట్రేషన్‌ పొందే వరకూ ప్రకటనలు, మార్కెటింగ్‌, బుకింగులు, విక్రయాలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే.. నిర్ణీత గడువులోగా ఫ్లాట్‌ను కొనుగోలుదారుకు అప్పగించడంలో విఫలమైన ఆరైన్‌ ఇన్‌ఫ్రాను రెరా తప్పుపట్టింది. మియాపూర్‌లోని ఆరైన్‌ ఎమరాల్డ్‌ ప్రాజెక్టులో ఫ్లాట్‌ కొన్న ఒక మహిళ ఫిర్యాదుపై విచారణ జరిపిన అథారిటీ.. బిల్డర్‌ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించింది. ఆ ప్రాజెక్టులో ఫ్లాట్‌ నంబర్‌ 502 కొనుగోలుకు 2025 సెప్టెంబరు 22న రూ.68 లక్షల విక్రయ ఒప్పందం చేసుకున్న బాధితురాలు.. రూ.35 లక్షలు డౌన్‌ పేమెంట్‌గా చెల్లించారు. మరో రూ.33 లక్షలు ఐసీఐసీఐ బ్యాంకు రుణం ద్వారా చెల్లించారు. 2025 నవంబరు 3న రిజిస్ట్రేషన్‌ పూర్తయినా అదేరోజున ఫ్లాట్‌ను నిర్మాణ సంస్థ అప్పగించలేదని అథారిటీ విచారణలో తేలింది. దీంతో 2025 నవంబరు 3 నుంచి.. ఫ్లాట్‌ను అప్పగించే వరకు.. కొనుగోలుదారు చెల్లించిన మొత్తంపై ఏడాదికి 10.85 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది.


వడ్డీతో వెనక్కివ్వాలి

ప్లాట్‌ విక్రయానికి సంబంధించి కొనుగోలుదారు నుంచి తీసుకున్న రూ.7 లక్షలను తిరిగి చెల్లించడంలో విఫలమైన బీవీఆర్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రెరా షాక్‌ ఇచ్చింది. ఆ సంస్థ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపూర్‌ గ్రామ పరిధిలో వేసిన ఎస్‌వీ ఎలకా్ట్రనిక్‌ సిటీ-3 లేఅవుట్‌లో ప్లాట్‌ నంబర్‌ 85ను ఒక మహిళ కొనుగోలు చేశారు. 184 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ప్లాట్‌ కోసం 2023 జూన్‌లో మూడు విడతల్లో రూ.7 లక్షలు చెల్లించారు. అయితే ఆ ప్లాట్‌ తనఖాలో ఉందని, నెలరోజుల్లో విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.


అవసరమైన అనుమతులు రాకపోవడంతో కొనుగోలుదారు తన డబ్బును వెనక్కి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సంస్థ రెండు చెక్కులు జారీ చేసినప్పటికీ బ్యాంకులో నగదు లేకపోవడంతో అవి చెల్లుబాటు కాలేదు. దీనిపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆ సంస్థ తరఫున ఎవరూ హాజరుకాకపోవడంతో అథారిటీ ఏకపక్షంగా విచారణ చేపట్టింది. ప్రాజెక్టుకు తప్పనిసరిగా ఉండాల్సిన రెరా రిజిస్ట్రేషన్‌ లేదని గుర్తించింది. రూ.7 లక్షలను 10.85 శాతం 60 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. ఇక.. పటాన్‌చెరు పరిధిలోని ఘన్‌పూర్‌లో ఆర్నేట్‌-1 ప్రాజెక్టులో అపార్ట్‌మెంట్‌ నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేయడంతోపాటు కొనుగోలుదారుడి నుంచి తీసుకున్న మొత్తాన్ని చెల్లించని శ్రీ ఆదిత్య స్క్వేర్స్‌ సంస్థకు రెరా అథారిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలుదారుడు చెల్లించిన రూ.17 లక్షలను 10.85 శాతం వార్షిక వడ్డీతో 60 రోజుల్లో ఇవ్వాలని స్పష్టం చేసింది.


ప్రాజెక్టు నిలిపివేత

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామ పరిధిలో భువన్‌తేజ ఇన్‌ఫ్రాకు చెందిన ఆరా (వెలిమల) ప్రాజెక్టులో ఫ్లాట్‌ నంబర్‌ 102 కొనుగోలుకు కవిత, సూరజ్‌ భరద్వాజ్‌ 2022 మార్చి 1న ఒప్పందం చేసుకున్నారు. 1700 చదరపు అడుగుల ఫ్లాట్‌ను 2023 డిసెంబరులో అప్పగించాల్సి ఉంది. అయితే 2024 జూన్‌ నాటికి ప్రాజెక్టు నిర్మాణం కేవలం 30 శాతమే పూర్తయినట్లు కొనుగోలుదారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధితులు చెల్లించిన రూ.26 లక్షలకు 10.85 శాతం వార్షిక వడ్డీ కలి పి 45 రోజుల్లో చెల్లించాలని రెరా ఆదేశించింది. భువన్‌ తేజ ఇన్‌ఫ్రా సంస్థను డిఫాల్టర్‌గా ప్రకటించి, ఆ సంస్థ చేపట్టే ఇతర ప్రాజెక్టుల్లోనూ ప్రకటనలు, మార్కెటింగ్‌, బుకింగులు, విక్రయాలు నిర్వహించకుండా నిషేధం విధించింది.


ఇక రెరా అనుమతులు పొందకుండానే విల్లా ప్రాజెక్టును చేపట్టి, డబ్బులు వసూలు చేసిన ఎస్‌వీఎం ఆదిత్య హోమ్స్‌పై అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసిం ది. ఒక కొనుగోలుదారు చెల్లించిన రూ.27,16,430 మొత్తాన్ని 10.85 శాతం వార్షిక వడ్డీతో 60 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. అలాగే.. త్రిపుర నిర్వాణలో నిర్మాణం ప్రారంభించకుండానే ఫ్లాట్‌ విక్రయానికి సంబంధించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన త్రిపురా కన్‌స్ట్రక్షన్స్‌కు అథారిటీ షాక్‌ ఇచ్చింది. కొనుగోలుదారు చెల్లించినరూ.41.85లక్షలను 10.85 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. ఇక.. వాసవి లేక్‌ సిటీ ఈస్ట్‌ ప్రాజెక్టులో కొనుగోలుదారుకుఫ్లాట్‌ అప్పగించడంలో జాప్యం చేసిన వాసవి రియల్టర్స్‌ ఎల్‌ఎల్‌పీపై అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొనుగోలుదారు చెల్లించిన రూ.49.50 లక్షలపై 10.85 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి...

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

Read Latest National News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 04:15 AM