ఉద్యోగ సంఘాలతో చర్చలు సఫలం.. రెండు డీఏలకు సర్కార్ ఓకే
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:12 PM
ఉద్యోగ సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రెండు డీఏలు ఇచ్చేందుకు సర్కార్ అంగీకరించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ముగిశాయి. రెండు డీఏలు ఇచ్చేందుకు సర్కార్ అంగీకరించింది. అలాగే నాలుగు నెలల తర్వాత మరో డీఏ ఇచ్చేందుకు ఓకే చెప్పింది. అంతేకాకుండా, ఈ నెలలోనే పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. పీఆర్సీ కమిషన్ గడువును పొడిగించకుండా నివేదిక అందేలా చూడాలని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. గడువులోపే పీఆర్సీ ప్రకటించాలని కోరాయి. డీఏ, పీఆర్సీ విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పాల్గొన్నారు.
ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది: లచ్చిరెడ్డి
సమావేశం అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ... సీఎస్ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కమిటీ మీటింగ్ జరిగిందని తెలిపారు. ఉద్యోగుల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్లతో ఈనెల 6న ఉద్యోగ సంకల్ప సభ నిర్వహించామని తెలిపారు. మొత్తం 68 డిమాండ్‌లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం సానుకులంగా స్పందించిందని.. అన్ని సమస్యల పరిష్కారానికి మార్గం చూపించినట్లు తెలిపారు. తమ డిమాండ్ల విషయంలో చొరవ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ సంజయ్ జాజుకు ధన్యవాదాలు తెలియజేశారు. మొదటి డీఏ 3.64, రెండో డీఏ 2.74 కు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. కమిటీ నివేదిక రాగానే పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని లచ్చిరెడ్డి పేర్కొన్నారు.
రెండుగా చీలిన ఉద్యోగ సంఘాలు
ప్రభుత్వంతో చర్చల అనంతరం ఉద్యోగ సంఘాలు చెరో దారిలో వెళ్లాయి. రెండు డీఏలు ఇస్తామన్న సర్కార్ హామీని రెవెన్యూ సంఘం స్వాగతించింది. ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయని భావిస్తోంది. అయితే, రెండు డీఏలకు మాత్రమే ప్రభుత్వం అంగీకరించడం పట్ల టీఎన్‌జీవో, టీజీవో సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. పెండింగ్ బిల్లులపై సీఎం, డిప్యూటీ సీఎం హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. నాంపల్లి టీఎన్‌జీవో భవన్‌లో టీఎన్‌జీవో, టీజీవో ఉద్యోగ సంఘాల నేతల అత్యవసర సమావేశమయ్యాయి.
ఇవి కూడా చదవండి...
‘ది ప్యారడైజ్’ కోసం నాని ప్రత్యేక విజ్ఞప్తి.. సీఎం రేవంత్ స్పందన ఇదే
క్యాబ్ ఎక్కుతుండగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు
Read Latest Telangana News And Telugu News