దిగ్విజయంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రూ.29 కోట్ల హుండీ ఆదాయం: టీటీడీ చైర్మన్
ABN , Publish Date - Sep 23 , 2026 | 03:34 PM
సమష్టి కృషితో తిరుమల వేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, పోలీసు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
తిరుమల, సెప్టెంబర్ 23: సమష్టి కృషితో తిరుమల వేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, పోలీసు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల మొదటి 8 రోజుల్లో 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. అలాగే హుండీ ద్వారా శ్రీవారికి 29 కోట్ల రూపాయల ఆదాయం లభించిందన్నారు. 21.80 లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేశామని అన్నారు. 2.04 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారని.. 33 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించామని వెల్లడించారు. సెప్టెంబర్ 15న శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారని.. 2027 టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారని తెలిపారు. పునరుద్ధరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్, భక్తుల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. లక్షలాది మంది భక్తులకు వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించామని వివరించారు.
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు..
అలిపిరి సమీపంలో 50 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు ప్రణాళికలు రూపొందించామని టీటీడీ చైర్మన్ వెల్లడించారు. తిరుమల, తిరుపతిలో పచ్చదనం పెంపునకు ‘వృక్ష గోవిందం’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. శ్రీవారి సేవ, వైద్య సేవల బలోపేతానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఉద్యోగుల హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులకు రూ.230 కోట్లు కేటాయించామన్నారు. గరుడసేవ రోజున తిరుమలకు వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించామని తెలిపారు. గరుడసేవ రోజు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడామని.. టీటీడీ ఏర్పాట్లపై వారు సంతోషం వ్యక్తం చేశారన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారని.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి టీటీడీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
విదేశీ కళాబృందాల ప్రదర్శనలకు విశేష స్పందన
మొట్ట మొదటిసారిగా 20 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు బ్రహ్మోత్సవ ప్రదర్శనకు అవకాశం కల్పించామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. వాహన సేవల ముందు 7,871 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు చేశారని.. గరుడసేవ రోజు 14 రాష్ట్రాల నుంచి 32 కళాబృందాలు.. 916 మంది కళాకారులు ప్రదర్శనలు చేశారని తెలిపారు. తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో విదేశీ కళా బృందాలు ప్రదర్శనలు ఇచ్చాయన్నారు. జర్మనీ, సింగపూర్ కళాబృందాల ప్రదర్శనలకు విశేష స్పందన లభించిందని వెల్లడించారు. ఉత్తమ కళాప్రదర్శన చేసిన బృందాలకు ప్రతి రోజూ ఈవో ముద్దాడ రవిచంద్ర సన్మానం చేశారన్నారు. తిరుమల, తిరుపతిలోని పలు వేదికల్లో విస్తృతంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. బ్రహ్మోత్సవాల్లో 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్ వినియోగించామని, 80 వేల సీజనల్ ఫ్లవర్స్‌తో తిరుమలలో పుష్పాలంకరణ చేసినట్లు వెల్లడించారు.
గరుడసేవలో 600 మంది ఉద్యోగుల సేవలు
తిరుమలలో విద్యుత్ అలంకరణలపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారని టీటీడీ చైర్మన్ అన్నారు. వాహన సేవల వీక్షణకు 36 భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల్లో 4 వేల మంది శ్రీవారి సేవకులు విశేష సేవలందించారని తెలిపారు. 50 మంది డాక్టర్లు,150 మంది పారామెడికల్ సిబ్బందితో వైద్య సేవలు అందించామన్నారు. భక్తుల కోసం 16 అంబులెన్సులు అందుబాటులో ఉంచామని చెప్పారు. 3 వేల మంది పోలీసులు, 2,400 మంది విజిలెన్స్ సిబ్బందితో బ్రహ్మోత్సవాల్లో భద్రత కల్పించామన్నారు. అలాగే, గరుడసేవ రోజున అదనంగా 1,000 మంది పోలీసులతో భద్రత కల్పించామని చెప్పారు. తిరుమల, తిరుపతిలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళికాబద్ధమైన పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. గరుడసేవ రోజు 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అందించినట్లు వెల్లడించారు. తిరుమలలో 173 టన్నుల తడి, పొడి చెత్తను వేరు చేసి తరలించామని తెలిపారు. గరుడసేవలో తిరుపతిలోని వివిధ విభాగాలకు చెందిన 600 మంది ఉద్యోగులు సేవలు అందించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో తుది దశకు 'సర్'.. 44 లక్షల నోటీసులపై విచారణ పూర్తి: ఢిల్లీరావు
2027లోగా హంద్రీనీవా పనులు పూర్తవ్వాలి.. సీఎం చంద్రబాబు ఆదేశం
Read Latest AP News And Telugu News