2027లోగా హంద్రీనీవా పనులు పూర్తవ్వాలి.. సీఎం చంద్రబాబు ఆదేశం
ABN , Publish Date - Sep 23 , 2026 | 03:02 PM
హంద్రీనీవా సుజల స్రవంతి పనులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. 2027లోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అమరావతి, సెప్టెంబర్ 23: హంద్రీనీవా సుజల స్రవంతి పనులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. 2027లోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు(బుధవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హంద్రీనీవా సుజల స్రవంతి(HNSS), శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సీఎం అడిగారు. హంద్రీనీవా సుజల స్రవంతి(HNSS) ఫేజ్–II పనుల పురోగతి, శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు సంబంధించిన టెండర్ ప్రక్రియ, పనుల పూర్తిపై ఆరా తీశారు.
HNSS ఫేజ్–IIలో మిగిలిన పనులకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైన నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులను 2027 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లికి స్పష్టం చేశారు. రాయచోటి నియోజకవర్గ పరిధిలోని HNSS మెయిన్ కెనాల్‌కు సంబంధించి 490 - 535 కిలో మీటర్ల వరకు సుమారు రూ.350 కోట్ల విలువైన పనులు కూడా సమగ్రంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
పనులు పూర్తయితే HNSS ద్వారా తాగునీరు, సాగునీటి అవసరాలు తీరడంతో పాటు సుమారు 25 వేల ఎకరాల ఖాళీ చెరువులను నింపి ప్రజలకు నీటి భరోసా కల్పించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి మండిపల్లి తెలిపారు. శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను HNSS కెనాల్‌తో అనుసంధానం చేసి, మార్గమధ్యంలోని చెరువులను నింపేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. HNSS పనులకు ప్రాధాన్యమిస్తూ నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
స్థానిక ఎన్నికలపై సీఎం దిశానిర్దేశం
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బాగా పడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. పంటలు వేసేందుకు రైతులను ప్రోత్సహించాలని.. వారికి అవసరమైన విత్తనాలు ఇవ్వాలని ఆదేశించారు. మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను అక్టోబర్ రెండవ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఇన్‌ఛార్జ్ మంత్రులు ఈ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకుని రావాలని.. మూడు పార్టీల మధ్య ఐక్యత ఉండాలని సూచించారు. తొలిదశలో మున్సిపాలిటీలు, రెండో దశలో జెడ్పీటీసీ ఎన్నికలు, మూడో దశలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడులు, శాప్ కార్యాలయంపై దాడులు చేసింది ఒకరే అని.. ఎక్కడికి వెళ్లినా 100 మంది రౌడీషీటర్లను వెంటేసుకుని వెళ్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ బెంగళూరులో కూర్చొని రౌడీ షీటర్లను, క్రిమినల్స్‌ను పంపి నేరాలు చేయిస్తున్నారని విమర్శించారు. రాజకీయ పార్టీల ముసుగులో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే పరిహారం వసూలు చేసే విధంగా చట్టం తీసుకురావాలని డీజీపీకి సీఎం చంద్రబాబు సూచించారు.
ఇవి కూడా చదవండి...
సాయికృష్ణ కేసు.. హైకోర్టు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు
ఏపీలో తుది దశకు 'సర్'.. 44 లక్షల నోటీసులపై విచారణ పూర్తి: ఢిల్లీరావు
Read Latest AP News And Telugu News