బాలల సంక్షేమానికి 4 కొత్త కార్యక్రమాలు.. ప్రారంభించిన మంత్రి సీతక్క
ABN , Publish Date - Nov 14 , 2026 | 10:57 AM
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో జరిగిన ఈ వేడుకలకు మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో జరిగిన ఈ వేడుకలకు మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపాలు అందరినీ అలరించాయి.
ఈ వేడుకల్లో భాగంగా బాలల సంక్షేమం కోసం నాలుగు కొత్త కార్యక్రమాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. పోషకాహార లోపం ఉన్న చిన్నారుల పర్యవేక్షణకు కృత్రిమ మేధ (AI) ఆధారిత వ్యవస్థను ప్రారంభించారు. బాల్య వివాహాల నిర్మూలనపై వంద రోజుల స్పెషల్ క్యాంపెయిన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే బాలల సంరక్షణ, దత్తత వ్యవస్థను విస్తరించేందుకు 6 నూతన ప్రత్యేక దత్తత సంస్థలను ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 4 నూతన చైల్డ్‌లైన్ సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషకరమని మంత్రి సీతక్క అన్నారు. ‘ఎంతోమంది పుడతారు చనిపోతారు.. ఆ రెండింటి మధ్యలో మనం చేసే సేవే మనల్ని ప్రజల్లో నిలుపుతుంది. జవహర్లాల్ నెహ్రూ ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో 15 సంవత్సరాల పాటు జైల్లో బంధీ అయ్యారు. నెహ్రూ, అంబేద్కర్ వంటి మహానీయుల కారణంగానే ఈ దేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది’ అని తెలిపారు. అణగారినవర్గాలకు ఎన్నో హక్కులు దక్కాయని చెప్పారు. ఈ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని వాళ్లు ఎంతో కృషి చేశారని మంత్రి అన్నారు.
పిల్లలే ఈ దేశ భవిష్యత్తు అని మహానీయుడు నెహ్రూ చెప్పారని మంత్రి గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పిల్లల రక్షణ, సంరక్షణ, పోషకాహారం, నాణ్యమైన విద్య ఇలా ఎన్నో చిన్నారులకు అందజేస్తున్నామన్నారు. చిన్నారుల భద్రత, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. అందులో భాగంగా ఈరోజు నాలుగు కొత్త కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. నూతన దత్తత కేంద్రాలు, చైల్డ్ హెల్ప్ లైన్లను కొత్తగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దత్తత ప్రక్రియను వేగవంతంగా అమలు చేయాలనుకుంటున్నామని అన్నారు. దత్తత ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా అక్రమ దత్తతను అడ్డుకోవచ్చని తెలిపారు. ఆహార కల్తీని అడ్డుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ‘టీ సేఫ్’ అనే విధానాన్ని తీసుకొచ్చారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
Read Latest Telangana News And Telugu News