Share News

ఆ వర్గాలను దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాల అమలు: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:25 PM

దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సొంత తల్లిలా ప్రేమ చూపించిన ఇందిరమ్మను వారు ఇప్పటికీ మరిచిపోలేదన్నారు.

ఆ వర్గాలను దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాల అమలు: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 22: దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సొంత తల్లిలా ప్రేమ చూపించిన ఇందిరమ్మను వారు ఇప్పటికీ మరిచిపోలేదన్నారు. ఈరోజు(మంగళవారం) సచివాలయంలో SC, ST అట్రాసిటీ నిరోధక చట్టం అమలుపై కమిటీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. 25 లక్షల ఎకరాలకు అసైన్డ్ పట్టాలు అందించిన ఘనత ఇందిరా గాంధీది అని కొనియాడారు. ఆమె స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. ప్రభుత్వం ఈ వర్గాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే అని తెలిపారు. ఎస్టీలకు 17 శాతం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు.


రాష్ట్రంలో 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 3 కోట్ల 48 లక్షల మందికి తెలంగాణలో సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. సన్న బియ్యంతో దళిత, గిరిజన వర్గాలకు మంచి భోజనం అందించగలుగుతున్నామని తెలిపారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోందన్నారు. బాధితులకు నష్టపరిహారాన్ని బడ్జెట్‌తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్‌లో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. చదువొక్కటే జీవితాలను మారుస్తుందని.. అట్టడుగు వర్గాలను చదువు వైపు నడిపించకపోతే సమస్య పరిష్కారం కాదన్నారు. ‘పిల్లల్ని చదువు వైపు, క్రీడలవైపు ప్రోత్సహించండి. రాజకీయాలకు అతీతంగా ఈ వర్గాల అభివృద్ధి చేసుకుందాం. ఈ ప్రభుత్వం మీది.. మీకోసం పనిచేస్తుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో డ్యాన్స్.. విశాఖ టీమ్‌పై చర్యలు

కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు.. దసరాకు ముందే పంపిణీ!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 04:52 PM