రెవెన్యూ, అటవీ సరిహద్దు వివాదాలకు ఇక శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:56 AM
రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దు వివాదాలకు రీ సర్వేతో శాశ్వత పరిష్కారం చూపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
రెండు శాఖలతో సంయుక్త రీ సర్వేలు
భూ వివాద రహిత తెలంగాణ లక్ష్యం : మంత్రి పొంగులేటి
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దు వివాదాలకు రీ సర్వేతో శాశ్వత పరిష్కారం చూపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి అధికారుల సమీక్షలో ఆయన మాట్లాడారు. సరిహద్దు వివాదాల వల్ల సామాన్య ప్రజలు, రైతులు ఏమాత్రం నష్టపోకూడదని, రెండు విభాగాలు పూర్తి సమన్వయంతో సంయుక్త రీ సర్వేలు నిర్వహించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో పని చేస్తున్నామని, భూ వివాదాలు లేని తెలంగాణ నిర్మాణమే తమ లక్ష్యమని తెలిపారు.
రెవెన్యూ, అటవీ విభాగాలు క్షేత్ర స్థాయిలో సర్వేలు చేపట్టాలని, ఈ సర్వేలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతుల సహాయంతో నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో అటవీ భూములు ఉన్నాయని, కొన్ని దశాబ్దాలుగా రెవెన్యూ, అటవీ విభాగాల మధ్య సరిహద్దు వివాదాలు అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పారు. క్షేత్ర స్థాయిలో భూముల వాస్తవ పరిస్థితులను పరిశీలించి, రికార్డులు, మ్యాపులు, సర్వే వివరాలను సమగ్రంగా సరిపోల్చి వివాదాలకు తావులేకుండా స్పష్టమైన హద్దులను నిర్ధారించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News