బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలకు మహర్దశ
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:09 AM
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రోత్సాహం, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టింది.
ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భారీగా నిధుల కేటాయింపు
గోదావరి పుష్కరాల దృష్ట్యా శాశ్వత మౌలిక వసతులు
యాదగిరిగుట్టపై ప్రత్యేక దృష్టి.. త్వరలో యూనివర్సిటీ!
ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రోత్సాహం.. ఉపాధికి ఊతం
ప్రభుత్వ పరిశీలనలో ‘టెంపుల్ కారిడార్’ అభివృద్ధి అంశం
బాసర గర్భాలయ నిర్మాణానికి సూరపనేని కుటుంబం రూ.30 కోట్ల విరాళం
హైదరాబాద్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రోత్సాహం, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించింది. పండుగలు, ఉత్సవాలకు ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత ప్రాతిపదికన సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించింది. ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వివిధ ప్రాంతాల్లోని ఆలయాల సమగ్ర అభివృద్ధితో పాటు అక్కడ పర్యాటక కార్యకలాపాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.258.85 కోట్లు, అక్కడే ఉన్న బద్ది పోచమ్మ ఆలయానికి రూ.9.99 కోట్లు కేటాయించింది.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ.276 కోట్లు, బాసర జ్ఞానసరస్వతి ఆలయానికి రూ.324 కోట్లు, కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి ఆలయానికి రూ.198 కోట్లు కేటాయించింది. కొడంగల్లో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.110 కోట్లు ఖర్చు చేయనుంది. గిరిజన కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం జాతరకు రూ.100 కోట్లు కేటాయించి అవసరమైన నిర్మాణ పనులు చేపట్టింది. వీటితో పాటు ధర్మపురి, కోటిలింగాల తదితర పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కూడా నిధులు కేటాయిస్తోంది.
యాదగిరిగుట్ట విమానగోపురానికి రూ.80 కోట్లు ఖర్చు చేయడంతోపాటు రూ.43 కోట్లతో దీక్షాపరుల సదనం, రూ.10 కోట్లతో కల్యాణ మండపం, రూ.50 కోట్లతో గోశాల నిర్మాణం చేపట్టనున్నారు. రూ.3.5 కోట్లతో కళాతోరణం ఏర్పాటు చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో ప్రభుత్వం యాదగిరిగుట్టకు బోర్డు (వైటీడీబీ) ఏర్పాటు చేసింది. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న యూనివర్సిటీ తరహాలో గుట్టలో లక్ష్మీనరసింహస్వామి పేరుతో యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మరోవైపు 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పుష్కరాల పనులకు రూ.1,115 కోట్లు
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలోని 74 ప్రాంతాల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు రూ.1,115 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. పుష్కర ఘాట్లు, ఆలయాలు, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, భక్తుల రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంబడి ఉన్న ప్రముఖ ఆలయాలను అనుసంధానిస్తూ టెంపుల్ కారిడార్ అభివృద్ధి అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
తద్వారా ఒకే యాత్రలో పలు పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం భక్తులకు కల్పించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో హోటళ్లు, రవాణా, చిరు వ్యాపారాలు, పర్యాటక సేవలకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. బాసర గర్భాల గర్భాలయాన్ని కృష్ణ శిలలతో అత్యంత సుందరంగా పునర్నిరించనున్నారు. ఇందుకు హైదరాబాద్కు చెందిన సూరపనేని సునంద, పద్మప్రియ దంపతులు రూ.30 కోట్లు విరాళం అందించారు. మహంకాళి అమ్మవారి ఆలయం, అల్వేటి మండపం, ప్రాకార మండపాలను సైతం కృష్ణశిలలతో నిర్మించనున్నారు.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
Read Latest Telangana News And Telugu News