Share News

ప్రశాంతంగా ఎస్‌ఐ ప్రిలిమ్స్‌ పరీక్ష

ABN , Publish Date - Nov 30 , 2026 | 04:32 AM

తెలంగాణలోని 335 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) ప్రిలిమ్స్‌ రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

ప్రశాంతంగా ఎస్‌ఐ ప్రిలిమ్స్‌ పరీక్ష

  • 90.44 శాతం హాజరు

  • మొదటిసారి ఆధార్‌తో ముఖ గుర్తింపు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): తెలంగాణలోని 335 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) ప్రిలిమ్స్‌ రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 275 పోస్టులకు సంబంధించి ఎస్‌ఐ ప్రిలిమ్స్‌కు 1,60,712మంది దరఖాస్తు చేసుకోగా... 1,45,342 మంది (90.44 శాతం) హాజరై పరీక్ష రాశారని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 15,370 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లాలో అత్యధిక హాజరు 92.69 శాతం కాగా, అత్యల్పంగా మేడ్చల్‌-మల్కాజిగిరి పరిధిలో 88.25 శాతం నమోదైంది. పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చరిత్రలోనే తొలిసారిగా అభ్యర్ధులకు ఆధార్‌ ఫేషియల్‌ అథెంటికేషన్‌ చేశారు. దీంతో పాటు డిజిటల్‌ వేలిముద్రలు, డిజిటల్‌ ఫొటోలు, బయోమెట్రిక్‌ హాజరు సైతం తీసుకున్నారు.


అభ్యర్థుల గుర్తింపును పక్కాగా నిర్థారించడంతో పాటు తదుపరి ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ విధానాన్ని అవలంబించామని శ్రీనివాసరావు తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని త్వరలో పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పెడతామని ఆయన వివరించారు. కాగా సూర్యాపేట సబ్‌జైల్‌లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వాంకుడోతు దేవేందర్‌ ప్రిలిమినరీ రాత పరీక్షకు కోర్టు ఆదేశాలతో పోలీస్‌ ఎస్కార్ట్‌ సహాయంతో హాజరయ్యాడు. దేవేందర్‌ రిమాండ్‌పై సబ్‌జైల్‌కు వచ్చిన సమయంలోనే తాను ఎస్‌ఐ ప్రిలిమినరీ రాతపరీక్షకు సన్నద్ధమవుతున్నానని ఉన్నతాధికారులకు తెలియజేశాడు.


అతని ఆసక్తిని గమనించిన పర్యవేక్షణాధికారి సుధాకర్‌రెడ్డి స్పందించి చదువుకునేందుకు పుస్తకాలను సమకూర్చారు. రోజుకు ఎనిమిది గంటలు చదువుకునేలా ప్రత్యేక అవకాశం కల్పించారు. నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రానికి చిన్నారితో వచ్చిన మహిళా అభ్యర్థి వెంట కుటుంబసభ్యులు లేకపోవడంతో కానిస్టేబుల్‌ షర్ఫోద్దీన్‌ ఆ చిన్నారి బాధ్యత తీసుకున్నారు. మరో ఘటనలో.. ఎస్‌ఐ కావాలనే భార్య ఆశయానికి భర్త ఆసరా అయ్యాడు. ఆమె కాలికి గాయమవడంతో తన భుజాలపైనే ఖమ్మం నగరంలోని పరీక్షా కేంద్రం వద్దకు మోసుకొచ్చాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!

ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 30 , 2026 | 04:32 AM