రికార్డు స్థాయిలో వరి, ఇతర పంటల దిగుబడి
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:53 AM
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి, ఇతర పంటల దిగుబడి నమోదవుతోందని, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ప్రధాన కారణమని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
అందుకు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే కారణం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి, ఇతర పంటల దిగుబడి నమోదవుతోందని, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ప్రధాన కారణమని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ రైతులకు నీరందిస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం భారీగా వ్యయం చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ఆశించిన ప్రయోజనాలు అందించడం లేదని విమర్శించారు.
దాన్ని పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగపడేలా చేయడానికి మరింత వ్యయం అవసరమవుతుందని, ఆ బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. ఎల్‌నినో పరిస్థితులు, నీటి లభ్యత తగ్గిపోవటంతో బోర్లు, చెరువులపై ఆధారపడిన కొన్ని ప్రాంతాల్లో పంటల సాగుకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. వచ్చే వర్షాకాలం వరకు తాగునీరు, ఇతర అత్యవసర అవసరాలకు నీటి కొరత రాకుండా, కరవు సంబంధిత ఇబ్బందులను తగ్గించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంకితభావంతో పని చేసే సామాన్య కార్యకర్త కూడా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం కాంగ్రెస్‌లో ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు, విజయాలను ప్రతి ఇంటికీ వివరించాలని, ప్రజలతో నిరంతరం అనుసంధానంలో ఉండాలని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News