సీఎం దగ్గరే తేల్చుకుంటాం
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:04 AM
రాష్ట్రంలో కేవలం కార్పొరేట్ కాలేజీలే ఉండాలనే విధంగా ఇంటర్ విద్య కార్యదర్శి అభిలాష పని చేస్తున్నారని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) ఆరోపించింది.
చిన్న కాలేజీలను చంపేయాలని చూస్తున్నారు
టాస్క్‌ఫోర్స్‌ను నియమించడం.. వసూళ్ల కోసమే
కేవలం కార్పొరేట్ కాలేజీలే ఉండాలని ‘అభిలాష’
ఇంటర్ విద్య కార్యదర్శిపై టీపీజేఎంఏ ధ్వజం
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కేవలం కార్పొరేట్ కాలేజీలే ఉండాలనే విధంగా ఇంటర్ విద్య కార్యదర్శి అభిలాష పని చేస్తున్నారని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) ఆరోపించింది. చిన్న చిన్న తప్పులకే తమపై భారీ జరిమానాలు విధిస్తున్న కార్యదర్శి.. అయ్యప్ప సొసైటీలో రెండు కార్పొరేట్ విద్యాసంస్థలు ఎలాంటి అనుమతులు లేకుండా 18 కాలేజీలు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదని టీపీజేఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్ పేర్కొన్నారు. చిన్న కాలేజీలను చంపేయాలని, కార్పొరేట్ సంస్థలకు అమ్మేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆయా అంశాలన్నింటినీ విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నకిలీ ఎన్వోసీల విషయం కాలేజీల యాజమాన్యాలకు తెలియదని, ఇంటర్ బోర్డులోని కొందరు అధికారులు కోరిన విధంగా యాజమాన్యాలు నడుచుకున్నాయన్నారు. నకిలీ ఎన్వోసీలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే లేక్‌వ్యూ పోలీస్స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. తాము కోరిన కంపెనీల నుంచి అగ్నిమాపక యంత్రాలు కొనుగోలు చేస్తే ఎన్వోసీల విషయం తాము చూసుకుంటామని ఇంటర్ బోర్డులోని ఉన్నతాధికారులు యాజమాన్యాల నుంచి రూ.10లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. ఫైర్ ఎన్వోసీలు సమర్పిస్తే రూ.8లక్షల జరిమానా రద్దు చేస్తామన్న కార్యదర్శి.. ఆ తర్వాత మాట మార్చారన్నారు.
అనుమతులు ఇచ్చిన అనంతరం మళ్లీ టాస్క్‌ఫోర్స్‌ను నియమించడం కాలేజీలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం కోసమేనని ఆరోపించారు. 1436 జూనియర్ కాలేజీల్లో 1252 కాలేజీలకే అనుబంధ గుర్తింపులు ఇచ్చారని, ఇంకా 184 కాలేజీలకు ఇవ్వాల్సి ఉందన్నారు. కాగా, కార్పొరేట్ కాలేజీలకు కార్యదర్శి అనుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరమని మైనార్టీ కాలేజీల సంఘం అధ్యక్షుడు అక్రమ్ అలీ అన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రంలోని 1436 కాలేజీల యాజమాన్యాలు,విద్యార్థులతో ఇంటర్‌బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
యాదాద్రి రెండో దశకు ఒడిసా, బెంగాల్‌ల బొగ్గు
కేటీఆర్‌కు షోకాజ్ నోటీసుపై స్టేటస్ కో
Read Latest AP News And Telangana News And International News And Telugu News