యాదాద్రి రెండో దశకు ఒడిసా, బెంగాల్‌ల బొగ్గు
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:48 AM
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీగటీస్)లోని రెండో దశలోని 1600 మెగావాట్ల ప్లాంట్లకు కోల్ ఇండియాకు చెందిన అనుబంధ కంపెనీలు ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్ (పశ్చిమబెంగాల్), మహానది కోల్ ఫీల్డ్(ఒడిసా) నుంచి బొగ్గు అందనుంది.
ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీగటీస్)లోని రెండో దశలోని 1600 మెగావాట్ల ప్లాంట్లకు కోల్ ఇండియాకు చెందిన అనుబంధ కంపెనీలు ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్ (పశ్చిమబెంగాల్), మహానది కోల్ ఫీల్డ్(ఒడిసా) నుంచి బొగ్గు అందనుంది. యాదాద్రిలో మొత్తం 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు ప్లాంట్లు ఉండగా అందులో మొదటి దశలో మూడు యూనిట్లకు సింగరేణి నుంచి బొగ్గు అందనుంది. రెండో దశలోని రెండు యూనిట్లకు ఈసీఎల్, ఎంసీఎల్‌ల నుంచి బొగ్గు లింకేజీ ఇస్తూ కోల్ ఇండియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఈసీఎల్, ఎంసీఎల్‌లను సంప్రదించి వాణిజ్యపరమైన లాంఛనాలన్నీ పూర్తిచేసి, ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్‌ఎస్ఏ) చేసుకోవాలని తెలంగాణ జెన్‌కోకు సూచించింది.
తాజా ఉత్తర్వులతో 1600 మెగావాట్లలో 320 మెగావాట్లకు సరిపడా జీ-8 రకం బొగ్గును ఏటా 1.146 మిలియన్ టన్నులు ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్ అందించగా... 1280 మెగావాట్ల విద్యుత్తు అవసరాలు తీర్చేలా జీ-13 రకం బొగ్గును 6.566 మిలియన్ టన్నులను మహానది కోల్ ఫీల్డ్(ఎంసీఎల్) సరఫరా చేయనుంది. మొత్తంగా 7.712 మిలియన్ టన్నుల బొగ్గును కోల్ ఇండియా కంపెనీల నుంచి యాదాద్రికి రానుంది. రెండో దశలోని రెండు యూనిట్లకు బొగ్గును ఇవ్వలేమని, బయటి నుంచి సర్దుబాటు చేసుకోవాలని సింగరేణి పలు దఫాలుగా లేఖలు రాసింది.
దాంతో బొగ్గు కొరతకు తోడు... ప్లాంట్ నిర్మాణంలో లోపాల వల్ల పూర్తిస్థాయిలో యాదాద్రిలో విద్యుదుత్పాదన జరగలేదు. ఫలితంగా గత సెప్టెంబరు 28వ తేదీన, మళ్లీ ఈనెల 21వ తేదీన కేంద్రబొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన స్టాండింగ్ లింకేజీ కమిటీ (లాంగ్ టర్మ్) సమావేశం జరగ్గా... ఆ సమావేశంలోనే జెన్‌కోకు బొగ్గును ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వంతో పాటు జెన్‌కో చేసిన ప్రయత్నాలు ప్రతిఫలించినట్లయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై సీఎం మౌనం వీడాలి
ఎల్‌నినోపై నేడు అఖిలపక్ష సమావేశం
అస్తిత్వానికి ఉస్మా‘నయా’ రూపం!
Read Latest AP News And Telangana News And International News And Telugu News