పైపుల ద్వారా సాగు నీరు
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:01 AM
కాలువల ద్వారా సరఫరా అయ్యే సాగునీరు పొలాలకు చేరేసరికి ఆవిరి నష్టాలు, భూమిలోకి ఇంకడం, పంపిణీ నష్టాలతో మూడోవంతు కూడా రావటం లేదు.
ఎత్తిపోతల పథకాల్లో లాభదాయకంగా ‘ప్రెషరైజ్డ్ పైప్డ్ ఇరిగేషన్ నెట్‌వర్క్’
చివరి ఆయకట్టుకూ నీళ్లు పారే అవకాశం
ఆవిరి, పంపిణీ నష్టాలకు ప్రత్యామ్నాయం
తగ్గనున్న కరెంటు చార్జీల భారం
ఆర్థికసాయం అందించనున్న కేంద్రం
సీతారామ ఎత్తిపోతల పథకంలో అమలుకు మంత్రి తుమ్మల ప్రతిపాదన
సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి నివేదిక
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాలువల ద్వారా సరఫరా అయ్యే సాగునీరు పొలాలకు చేరేసరికి ఆవిరి నష్టాలు, భూమిలోకి ఇంకడం, పంపిణీ నష్టాలతో మూడోవంతు కూడా రావటం లేదు. మరోవైపు, ఎత్తిపోతల పథకాలను చూస్తే విద్యుత్ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రత్నామ్నాయంవైపు చూస్తోంది. పైపుల ద్వారా చివరి ఆయకట్టు వరకూ నీళ్లు అందించే ‘ప్రెషరైజ్డ్ పైప్డ్ ఇరిగేషన్ నెట్‌వర్క్’ (పీపీఐఎన్)ను అమలు చేయాలని భావిస్తోంది. ఇది కేంద్రప్రభుత్వ పథకం. గత ఏడాది జూన్‌లో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ‘మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవల్‌పమెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్’ (ఎం-క్యాడ్) పథకాన్ని ప్రకటించింది.
దీంట్లోభాగమే పీపీఐఎన్. దీంట్లో ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ నుంచి మెయిన్‌లైన్, బ్రాంచ్‌లైన్, కంట్రోల్ వాల్వ్, డిస్ట్రిబ్యూటరీ లైన్లు, మైనర్ లైన్, సబ్‌మైనర్ లైన్ల ద్వారా పొలాల గట్ల దాకా నీటిని పంపిణీ చేయవచ్చు. ఆ తర్వాత పొలాల్లో ఎవరికి వారు నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎం-క్యాడ్ పథకం క్లస్టర్ విధానంలో అమలవుతుంది. ఒక్కో క్లస్టర్ కనిష్ఠంగా 50 హెక్టార్ల నుంచి గరిష్ఠంగా 5 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటవుతుంది. ప్రతి క్లస్టర్‌లో రైతులను సమీకరించి నీటి వినియోగ సంఘాలను నెలకొల్పుతారు.ఈ పథకంలో మొత్తం 1,600 కోట్ల వ్యయాన్ని కేంద్రం ప్రతిపాదించింది. దీంట్లో కేంద్రం వాటా రూ.1,100 కోట్లు కాగా, రాష్ట్రాల వాటా రూ.500 కోట్లు. పైపులైన్ల నిర్మాణం పూర్తయిన తర్వాత నీటి నిర్వహణ బాధ్యతలను దశలవారీగా రైతుల ఆధ్వర్యంలోని నీటి వినియోగ సంఘాలకు బదిలీ చేస్తారు. వాటికి ఐదేళ్ల పాటు శిక్షణ, నిర్వహణ సహకారం అందించనున్నారు.
సీతారామ ఎత్తిపోతల పథకంలో అమలు!
సీతారామ ఎత్తిపోతల పథకంలోని అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో పీపీఐఎన్‌ను అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదించారు. పీపీఐఎన్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. పీపీఐఎన్‌తో సీతారామ కింద 1.57 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని యోచిస్తున్నారు. పీపీఐఎన్ విధానంలో ముందుకెళ్తే సేకరించాల్సిన భూమి, నిర్మాణవ్యయం గణనీయంగా తగ్గుతాయని ప్రతిపాదించారు. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రతి చుక్క విలువైనదే కాబట్టి.. పీపీఐఎన్‌తో సాగునీరు సద్వినియోగం కావటంతోపాటు ప్రభుత్వానికి కరెంట్ బిల్లుల భారం నుంచి ఉపశమనం దక్కుతుంది. పైగా, పీపీఐఎన్ అమలుకు కేంద్రం ఎం-క్యాడ్ కింద ఆర్థికసహాయం అందిస్తుంది.
30-35 శాతమే నీళ్లు అందుతున్నాయి
సాధారణంగా ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని హెడ్ రెగ్యులేటరీ ద్వారా మెయిన్ కెనాల్‌లో వేసి... క్రాస్ రెగ్యులేటర్, బ్రాంచ్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్, మైనర్, సబ్ మైనర్లు, ఫీల్డ్ ఛానల్ ద్వారా తరలించే జలాల్లో 30-35 శాతం మాత్రమే సాగుకు పనికొస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. 10 వేల క్యూసెక్కుల నీరు కాలువలకు వెళ్తే... ఆవిరి నష్టాలు, భూమిలోకి ఇంకడం, పంపిణీ నష్టాలతో పట్టుమని 3 వేల క్యూసెక్కులు కూడా పొలాల్లో పారడం లేదంటున్నారు. పైగా భూముల విలువలు పెరగడంతో భూసేకరణ కష్టంగా మారుతోంది. ఇక భారీ వ్యయంతో (కరెంటుచార్జీలు) లిఫ్టుల ద్వారా నీటిని పంపింగ్ చేసి కెనాల్‌లో వేస్తుండగా... కాలువల్లోని నీళ్లను తీసుకెళ్లడానికి రైతాంగం మళ్లీ మోటార్లు వినియోగించడం, కెనాల్‌లో మోటార్లు పెట్టుకోలేని వారు బోర్లు వేసుకొని సాగు చేస్తుండటంతో లిఫ్టులకు అర్థం లేకుండా పోతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, ‘ప్రెషరైజ్డ్ పైప్డ్ ఇరిగేషన్ నెట్‌వర్క్’ పథకం ముందుకొచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News