పౌల్ట్రీకి మరింత ప్రోత్సాహం
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:10 AM
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పౌల్ట్రీ పరిశ్రమది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. దీనిని కేవలం కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తికే పరిమితమైన రంగంగా చూడలేమన్నారు.
అనుమతులకు త్వరలో సింగిల్ విండో విధానం
ప్రతిపాదనలతో వస్తే భారత్ ఫ్యూచర్ సిటీలో
కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు భూమి కేటాయింపు
లక్ష్యాల సాధనకు అనుబంధ రంగాలకు పెద్దపీట
18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2026లో
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పౌల్ట్రీ పరిశ్రమది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. దీనిని కేవలం కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తికే పరిమితమైన రంగంగా చూడలేమన్నారు. వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తూ రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం తరఫున మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఐటీ, ఫార్మా, డిఫెన్స్, డేటా సెంటర్ల తరహాలోనే పౌల్ట్రీని కూడా ప్రాధాన్యం కలిగిన పరిశ్రమగా గుర్తించి, దాని సమస్యల పరిష్కారానికి శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
బుధవారం హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో- 2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరలోనే సమగ్రమైన పాలసీతో సింగిల్ విండో విధానం అమల్లోకి తెస్తామన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి తగిన ప్రతిపాదనలతో వస్తే భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన భూమి కేటాయిస్తామని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమతో వ్యవసాయ రంగానికి విడదీయలేని అనుంబంధం ఉందని, మొక్కజొన్న, సోయాబీన్, నూకలు, తవుడు తదితర వ్యవసాయ ఉత్పత్తులు, వాటి ఉప ఉత్పత్తులను పౌల్ట్రీ పరిశ్రమ వినియోగిస్తోందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజూ 5.30కోట్ల గుడ్లను ఉత్పత్తి చేస్తూ, యువశక్తికి ప్రొటీన్ అందిస్తున్నారని చెప్పారు.
విధానాల్లో మార్పు ఉండదు..
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా.. పారిశ్రామిక విధానాల్లో మార్పు ఉండదని సీఎం రేవంత్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రూపొందించిన ఉత్తమ విధానాలు, ఆచరణల్ని కొనసాగిస్తూనే అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా పారిశ్రామిక విధానాలు మారుతున్న పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో మాత్రం పెట్టుబడిదారులకు అనిశ్చితి కలిగించే నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమైన భూమి, విధానాలు, అనుమతులు, ఫుడ్గ్రెయిన్స్ తదితర అంశాల్లో ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. పరిశ్రమల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
పెట్టుబడిదారులు.. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పెట్టుబడులకు రక్షణ కల్పిస్తూ పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణం సృష్టిస్తామని భరోసా ఇచ్చారు. కేంద్రంతో, ఇతర రాష్ట్రాలతో తమకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు, నిధులు, వాటాల కోసం ప్రధాని మోదీని తరచూ కలుస్తున్నట్లు తెలిపారు. పార్టీ నిర్వహణ, ప్రభుత్వ నిర్వహణ రెండూ వేర్వేరు అంశాలన్నారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధికి భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా సుమారు 5 శాతం ఉందని, 2047 నాటికి దానిని పది శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ కూడా తన ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసుకుంటుందని పేర్కొన్నారు. ఈ లక్ష్యాలను సాధించాలంటే పౌల్ట్రీ వంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్ వెస్లీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News