Share News

నేరగాడు 10 లక్షల మందిలో ఉన్నా.. 15 సెకన్లలో పట్టేయొచ్చు!

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:07 AM

నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ పోలీసు శాఖ మరో ముందడుగు వేసింది.

నేరగాడు 10 లక్షల మందిలో ఉన్నా.. 15 సెకన్లలో పట్టేయొచ్చు!
Face Recognition System

  • తెలంగాణ పోలీసుల చేతిలో డిజిటల్‌ అస్త్రాలు

  • నేర పరిశోధన నుంచి నేరస్థుల గుర్తింపు వరకు..

  • ప్రతి అడుగులోనూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం

  • 9.8 లక్షల ఫొటోలతో ముఖ గుర్తింపు డేటాబేస్‌

  • జైలు నుంచి ఖైదీ విడుదలైనా పోలీసులకు తక్షణ సమాచారం

  • రాష్ట్రంలోని 35 భరోసా కేంద్రాలు ఒకే గొడుగు కిందకు

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ పోలీసు శాఖ మరో ముందడుగు వేసింది. నేరం జరిగిన తర్వాత నిందితుల కోసం గాలించే సంప్రదాయ పద్ధతులకు తోడు.. నేర స్థలంలోనే ఆధారాల సేకరణ, ఫొటోల ఆధారంగా అనుమానితుల గుర్తింపు, జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలపై నిఘా, కేసుల దర్యాప్తులో అధికారులకు కృత్రిమ మేధ (ఏఐ) సహాయం.. ఇలా బహుముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. ఈ దిశగా నేర పరిశోధన విభాగం (సీఐడీ) రూపొందించిన పలు డిజిటల్‌ సేవలు పోలీసులకు ఆయుధాలుగా మారాయి.


నేర పరిశోధనలో కీలకమైన.. వ్యక్తుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు మొబైల్‌ ఫేస్‌ సెర్చ్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఈ సాంకేతిక వ్యవస్థలో 9.8 లక్షలకు పైగా ఫొటోలతో డేటాబేస్‌ ఉంది. ఒక వ్యక్తి ఫొటోను ఇస్తే 15 సెకన్లలో ముఖ గుర్తింపు సరిపోలికలను అందిస్తుంది. దీంతో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే పోలీసులు అనుమానితుల వివరాలను వేగంగా పరిశీలించవచ్చు. తప్పిపోయిన వ్యక్తులు, గుర్తుతెలియని మృతదేహాలు, అనుమానితుల గుర్తింపునకు ఇది ఉపయోగపడనుంది. అయితే ఫేస్‌ మ్యాచ్‌ ద్వారా వచ్చే ఫలితం ఒక్కటే నేర నిర్ధారణకు ఆధారం కాదు. ఇతర సాక్ష్యాధారాలతోనూ ధ్రువీకరించాల్సి ఉంటుంది.


నేరస్థలంలోనే వేలిముద్రల సేకరణ..

నేరస్థలంలో లభించే వేలిముద్రలను సేకరించి సంబంధిత విభాగాలకు పంపి, పరిశీలన అనంతరం సరిపోలికల కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ‘క్రైమ్‌ సీన్‌ చాన్స్‌ ప్రింట్‌’ యాప్‌ను ప్రవే శపెట్టారు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ సాయంతోనే నేరస్థలంలో లభించిన వేలిముద్రలను సేకరించి వెంటనే రాష్ట్ర సర్వర్‌కు పంపే అవకాశం కల్పించారు. అక్కడ ఉన్న డేటాతో ఆటోమేటిక్‌గా సరిపోల్చడం ద్వారా అనుమానితుల గుర్తింపునకు అవసరమైన సమాచారం వేగంగా లభిస్తుంది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.


అంతేకాకుండా.. జైలు నుంచి విడుదలైన ఖైదీల వివరాలు సంబంధిత పోలీ్‌సస్టేషన్లకు సకాలంలో చేరకపోవడం వల్ల కొన్నిసార్లు పర్యవేక్షణలో జాప్యం జరుగుతుంటుంది. దీనిని అధిగమించేందుకు జైల్‌ రిలీజ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను రూపొందించారు. జాతీయ సమాచార కేంద్రం నిర్వహిస్తున్న ఈ-ప్రి జన్స్‌ వ్యవస్థను క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌తో అనుసంధానించారు. దీంతోపాటు మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి బాధితులకు సమగ్ర సహాయం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 35 భరోసా కేంద్రాలను ఒకే డిజిటల్‌ వేదికపైకి తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా భరోసా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. బాధితురాలు కేంద్రాన్ని ఆశ్రయించినప్పటి నుంచి కౌన్సెలింగ్‌, వైద్య సహాయం, న్యాయపరమైన సహకారం, పునరావాసం వంటి అంశాలన్నింటినీ డిజిటల్‌ విధానంలో పర్యవేక్షించవచ్చు.


సీఐడీకి ప్రత్యేక వెబ్‌సైట్‌..

నేర పరిశోధన విభాగ సమాచారం, సువలను ప్రజలకు మరింత చేరువ చేదుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. https://cid.tspolice.gov.in ద్వారా సీఐడీకి సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు దర్యాప్తు విధానాల్లోనూ ప్రమాణాలను పెంచేందుకు ఐదు సంపుటాల స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ను రూపొందించారు. శారీరక నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలు, మహిళలు-చిన్నారులపై నేరాలు, ప్రత్యేక-స్థానిక చట్టాలు, ఇతర నేరాల దర్యాప్తు విధానాలను వీటిలో వివరించారు.


నేరం జరిగినప్పుడు ఎలాంటి ఆధారాలు సేకరించాలి? దర్యాప్తు విధానాలు ఏమిటి?అనే అంశాలపై అధికారులకు మార్గదర్శకాలు అందుబాటులో ఉంటాయి. పోలీసు సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పోలీ్‌సేస్టషన్లలో పిటిషన్లు ఇవ్వడం, ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, ఈ-చలాన్లు, పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ వంటి సేవలను వినియోగించుకున్న ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరిస్తారు. వీటి ఆధారంగా సేవల్లో లోపాలను గుర్తించి, పనితీరును మెరుగుపరచడంతోపాటు పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచే అవకాశం ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 06:08 AM