Share News

నా ఫోన్ ట్యాప్ చేసినా ఇబ్బంది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Nov 13 , 2026 | 07:04 PM

తన ఫోన్ ట్యాప్ చేసినా ఇబ్బంది లేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తన ఫోన్‌లో ఏదైనా వినొచ్చని అన్నారు.

నా ఫోన్ ట్యాప్ చేసినా ఇబ్బంది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 13: తన ఫోన్ ట్యాప్ చేసినా ఇబ్బంది లేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తన ఫోన్‌లో ఏదైనా వినొచ్చని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ త్వరలోనే ముగుస్తుందని చెప్పారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తాయని అన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ గుజరాత్ కోసమే పని చేస్తుందని విమర్శించారు. తెలంగాణ సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.


గ్లోబల్ సమ్మిట్ కంటే ముందు భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. భారత్ సమ్మిట్‌కు 70 దేశాలకు చెందిన వెయ్యి మంది ప్రతినిధులను ఆహ్వానించామని చెప్పారు. ఈ పర్యటనకు వచ్చే విదేశీ ప్రతినిధులను కేంద్రం అడ్డుకుంటోందని మండిపడ్డారు. భారత్ సమ్మిట్‌తో ఎలాంటి ప్రయోజనాలు లేవని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన, రోడ్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలంగాణ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలను బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు తీరుతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌ను బీజేపీ గుడ్డిగా వ్యతిరేకించకూడదని ఆ పార్టీ నేతలకు హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని అవుతారని బీజేపీ భయపడుతుందని అన్నారు.


గతంలో ప్రధాని, విపక్ష నేత మధ్య.. సుహృద్భావ వాతావరణం ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. శనివారం గిగ్ వర్కర్లను ఉద్దేశించి హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని వివరించారు. భారత్ సమ్మిట్‌లో మన దేశం తరఫున ప్రపంచానికి సందేశం ఇవ్వడానికి రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్నారని చెప్పారు.


రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు వస్తే బీజేపీకి ఇబ్బంది ఏమిటని సీఎం రేవంత్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఎందుకు భయపడుతున్నారు? అంటూ ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోదీ వివిధ దేశాల్లో పలు సదస్సులకు వెళ్తుతుంటారని అన్నారు. పాకిస్థాన్‌ వెళ్లి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలుస్తారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ఏం చేసినా ప్రధాని మోదీ వ్యతిరేకిస్తారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విభజన గాయాలతో ఇబ్బందులు పడినా అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ: ఉప రాష్ట్రపతి

నిమ్స్‌ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు: మంత్రి రాజనర్సింహ ఆదేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2026 | 07:30 PM