Share News

విభజన గాయాలతో ఇబ్బందులు పడినా అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ: ఉప రాష్ట్రపతి

ABN , Publish Date - Nov 13 , 2026 | 06:13 PM

విభజన గాయాలతో ఇబ్బందులు పడినా ఇప్పుడు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతోందని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకూ రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడిని ఏపీ ఆకర్షించటం చిన్న విషయం కాదని అన్నారు.

విభజన గాయాలతో ఇబ్బందులు పడినా అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ: ఉప రాష్ట్రపతి

విశాఖపట్నం, నవంబర్13: విభజన గాయాలతో ఇబ్బందులు పడినా ఇప్పుడు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతోందని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకూ రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడిని ఏపీ ఆకర్షించటం చిన్న విషయం కాదని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా స్వర్ణాంధ్ర సాధన వైపు ఏపీ నడుస్తోందని చెప్పారు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 31వ వార్షిక సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు కార్యక్రమానికి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దల్ నజిర్‌తోపాటు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. రెండు రోజులు జరిగిన పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలతో పాటు మేథోమథనం కూడా ఈ సదస్సులో జరిగిందని అన్నారు. వచ్చే ఏడాది నిర్వహించే సదస్సుకు కూడా పారిశ్రామిక వేత్తలను ఇప్పుడే సీఎం చంద్రబాబు ఆహ్వానించటం ఆయన ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని అభివర్ణించారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ వేర్వేరు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయని సీపీ రాధాకృష్ణన్ వివరించారు. నౌకాశ్రయాలు, ఎయిర్‌పోర్టులు, ఎలక్ట్రానిక్స్, స్పేస్, డిఫెన్స్, టూరిజం తదితర రంగాల్లో ఏపీ పెట్టుబడుల్ని ఆకట్టుకుంటోందని తెలిపారు. ప్రతీ సంక్షోభ సమయం అంతే స్థాయిలో అవకాశాలను కూడా తీసుకువస్తుందని చెప్పారు. ఈ సమయంలో భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటోందని అన్నారు.


ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ లక్ష్యాలను దేశం అందుకునేందుకు ముందుకు వెళ్తోందని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. గ్రోత్ ఇంజన్లుగా వేర్వేరు రంగాలు అభివృద్ధి పథంలో వెళ్తున్నాయని తెలిపారు. సమీప భవిష్యత్తులో టెక్నాలజీ రంగమే ఓ డ్రైవింగ్ ఫోర్సుగా నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఏఐ లాంటి ఆధునాతన టెక్నాలజీని పాలన, పౌరసేవల కోసం వినియోగించటం అభినందనీయమని పేర్కొన్నారు.


డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రా తయారు చేయటం ఓ కీలకమైన అంశంగా మారుతుందని సీపీ రాధాకృష్ణన్ చెప్పారు. మన తయారీ రంగంతో పాటు దేశీయ పరిశ్రమలు అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా సిద్ధం కావాలని ఆకాంక్షించారు. దేశం ఓ బలమైన ఆర్ధిక శక్తిగా ఎదగడానికి అవసరమైన రంగాలపై మనమంతా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ సమయంలోనే ఎంఎస్ఎంఈలతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించాలని పేర్కొన్నారు. మానవ వనరుల నైపుణ్యాలను పెంచుకుని భారతీయ మేధోసంపత్తిని ప్రపంచానికి చాటాలని పేర్కొన్నారు.


ప్రభుత్వం, పరిశ్రమలు, విద్య రంగం, ఆవిష్కర్తలు ఒక్క తాటిపై వచ్చి భారత్ ట్రాన్సఫర్మేషన్ కోసం పనిచేయాలని సంస్థలకు భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సూచించారు. కోవిడ్ సమయంలో ఆవిష్కరించి, ఉచితంగా అందజేసిన వాక్సీన్ 100 దేశాలకు ప్రాణం పోసిందని గుర్తు చేశారు. తద్వారా భారత్ తన సత్తా చాటిందని సోదాహరణగా వివరించారు.

సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, అతిథులందరికీ ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఒప్పందాల నుంచి అభివృద్ధి లక్ష్యాల వైపు అంతా ముందుకు వెళ్లాల్సి ఉందని అన్నారు. వర్క్ టుగెదర్ గ్రో టుగెదర్ షేర్ ప్రాస్పెరిటీ అనే విధానంలో పని చేద్దామని ఈ వేదిక నుంచి భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు.


సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ఏపీ: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతమైందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు. 9వ సారి విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన ఈ భాగస్వామ్య సదస్సులో ఆసియా నుంచి ఆఫ్రికా వరకూ వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పారిశ్రామిక వేత్తలు పూర్తి విశ్వాసం ఉంచారని తెలిపారు.


గడచిన రెండున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గుర్తు చేశారు. ఈ పెట్టుబడుల ద్వారా యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్, తూర్పు కోస్తా రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులు.. కేంద్ర సహకారంతో సాకారం అయ్యాయని తెలిపారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన దేశవిదేశీ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులతోపాటు పారిశ్రామిక వేత్తలకు ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అభినందనలు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎల్‌నినో ప్రభావం.. రబీ పంటలపై జిల్లా కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు

నిమ్స్‌ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు: మంత్రి రాజనర్సింహ ఆదేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2026 | 06:31 PM