ఆయిల్‌పామ్ తోటల్లో ‘ఏబీ కేబుల్స్’!
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:46 AM
ఆయిల్‌పామ్ తోటల మధ్య నుంచి వెళ్తున్న బహిరంగ విద్యుత్ తీగల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
బహిరంగ విద్యుత్తు తీగల స్థానంలో వాటిని ఏర్పాటు చేయాలి
సీఎం, డిప్యూటీ సీఎంకు మంత్రి తుమ్మల ప్రతిపాదన
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ తోటల మధ్య నుంచి వెళ్తున్న బహిరంగ విద్యుత్ తీగల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ఆయిల్‌పామ్ సాగును మరింత లాభదాయకంగా మార్చడంతోపాటు రైతులకు అదనపు ఆదాయం సమకూర్చే దిశగా సూచనలు చేశారు. బహిరంగ విద్యుత్తు తీగల స్థానంలో సాంకేతికంగా సాధ్యమైన చోట ‘ఏరియల్ బంచ్డ్ (ఏబీ)’ కేబుల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో 3.37 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగు చేస్తున్నారు.
భవిష్యత్తులో దీన్ని 10 లక్షల ఎకరాలకు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అయితే, క్షేత్రస్థాయిలో విద్యుత్ లైన్లతో ఆయిల్‌పామ్ రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి. సాధారణంగా ఎకరం భూమిలో 50 మొక్కలు నాటుతారు. తోటల మధ్య నుంచి వెళ్తున్న 11 కేవీ, ఎల్‌టీ విద్యుత్ తీగల కారణంగా భూమి వృథాగా ఉండడంతో.. రైతులు ఆదాయాన్ని కోల్పోతున్నారు.నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌లో నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ సమస్య తీవ్రత వెల్లడైంది. సుమారు నాలుగున్నర ఎకరాల ఆయిల్‌పామ్ తోట మధ్య నుంచి 150 మీటర్ల పొడవున 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్తుండడంతో 20మొక్కలు నాటలేకపోయినట్లు గుర్తించారు. ఈ 20 మొక్కలతో 35 ఏళ్ల పంట జీవితకాలంలో సుమారు రూ.27.45 లక్షల స్థూల ఆదాయం పొందే అవకాశం ఉంది. 11 కేవీ విద్యుత్ లైన్‌ను ఏబీ కేబుల్‌గా మార్చేందుకు కేవలం రూ.1.45 లక్షల వ్యయం అవుతోంది. ఎకరా తోటలో ప్రస్తుతం ఉన్న స్తంభాలకే ఏబీ కేబుల్స్ ఏర్పాటు చేయడానికి రూ.61-76 వేల ఖర్చవుతుందని అంచనా వేశారు. దీంతో విద్యుత్ ప్రమాదాలు కూడా తగ్గుతాయని గుర్తించారు.
రాయితీ ఇస్తే రైతులకు ఉపశమనం
ఏబీ కేబుల్స్ ఏర్పాటుతో రైతులకు ప్రయోజనం కలిగించడంతో పాటు వారిపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు మంత్రి తుమ్మల పలు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించారు. ఏబీ కేబుల్స్ ఏర్పాటుకు సబ్సిడీ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సబ్సిడీ సాధ్యపడకపోతే, డిస్కంలకు చెల్లించాల్సిన సంబంధిత చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్‌పామ్ తోటల నుంచి వెళ్తున్న 11 కేవీ, ఎల్‌టీ విద్యుత్ లైన్లను విద్యుత్ శాఖ, ఉద్యానశాఖ సంయుక్తంగా గుర్తించి, సాంకేతికంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు
స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News