10,450 ఎంబీబీఎస్ సీట్లు
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:57 AM
తెలంగాణలో వైద్యవిద్యను అభ్యసించే విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలో మెడిసిన్ అండర్ గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్) సీట్ల సంఖ్య భారీగా పెరిగి, పదివేల మార్క్‌ను దాటింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) శుక్రవారం ‘సీట్ మ్యాట్రిక్స్’ను విడుదల చేసింది.
రాష్ట్రంలో మొత్తం సీట్లివి.. ఈ ఏడాది కొత్తగా 1,010
తాజాగా సీట్ మ్యాట్రిక్స్‌ను వెల్లడించిన ఎన్‌ఎంసీ
ఏపీ, కేరళల కంటే తెలంగాణలోనే ఎక్కువ
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వైద్యవిద్యను అభ్యసించే విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలో మెడిసిన్ అండర్ గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్) సీట్ల సంఖ్య భారీగా పెరిగి, పదివేల మార్క్‌ను దాటింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) శుక్రవారం ‘సీట్ మ్యాట్రిక్స్’ను విడుదల చేసింది. దాని ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా వైద్య సీట్ల సంఖ్య ఏకంగా 10,450కు చేరింది. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళలతో పోలిస్తే తెలంగాణలో మెడికల్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. దీంతో స్వరాష్ట్రంలో మెడిసిన్ చదవాలనుకునే వారికి ఎక్కువ అవకాశం లభిస్తుందని వైద్యవిద్య నిపుణులు చెబుతున్నారు.
ఎన్‌ఎంసీ తాజా నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో ఈసారి కొత్తగా 1,010 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులు లభించాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 110 సీట్లు పెరగ్గా, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 900 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో తెలంగాణ వైద్య విద్యా రంగంలో సరికొత్త మైలురాయి నమోదైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో 25, నిజామాబాద్‌లో 30, సిద్దిపేటలో 25, రిమ్స్ ఆదిలాబాద్‌లో 30 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. ఇక ప్రైవేటులోని 11 వైద్య కళాశాలల్లో కొత్తగా 900 యూజీ సీట్లు పెరిగాయి. అవన్నీ కూడా హైదరాబాద్, దాని చుట్టు పక్కల ఉన్న మెడికల్ కాలేజీల్లోనే ఉండటం గమనార్హం.
వంద సీట్ల చొప్పున పెరిగిన వైద్య కళాశాలల్లో మహేశ్వర, ఎంఎన్‌ఆర్, ఎస్వీఎస్ మహబూబ్‌నగర్ ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా రాజరాజేశ్వరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌సకు 150 సీట్లతో ఎన్‌ఎంసీ అనుమతినిచ్చింది. ఇక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 40 మెడికల్ కళాశాలల్లో 7,615 సీట్లు అందుబాటులో ఉండగా, కేరళలో 5,754 సీట్లు ఉన్నాయి. కేరళ కంటే తెలంగాణలో దాదాపు రెట్టింపు సీట్లు ఉండటం గమనార్హం. సీట్ల పెంపుతో ఈ ఏడాది నీట్ రాసిన తెలంగాణ విద్యార్థులకు మెడికల్ సీటు సాధించే అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎన్‌ఎంసీ
కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియలో కళాశాలలు, కౌన్సెలింగ్ కమిటీలు తాము ఆమోదించిన సీట్ల పరిమితిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని జాతీయ వైద్య కమిషన్ స్పష్టం చేసింది. ఆమోదించిన సీట్ల కంటే అదనంగా అడ్మిషన్లు చేపడితే ఎన్‌ఎంసీ చట్టం-2019 ప్రకారం సదరు యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని ఎన్‌ఎంసీ కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లాంగర్ హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రాల వైద్య విద్య సంబంధిత అధికారులకు, కౌన్సెలింగ్ కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు.
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు రెండో విడత వెబ్ ఆప్షన్లు 14 వరకు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు సంబంధించి కాళోజీ హెల్త్ యూనివర్శిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11 సాయంత్రం 4.30 గంటల నుంచి 14న మధ్యాహ్నం 1:00 గంట వరకు అధికారిక వెబ్‌సైట్ (https://tsmedadm.tsche.in) ద్వారా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని వర్సిటీ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కాగా, తొలి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొంది కళాశాలల్లో చేరిన అభ్యర్థులు, అలాగే ఖాళీగా ఉన్న సీట్లతో పాటు మహబూబ్‌నగర్‌లోని ఎస్‌జివీఎస్, వికారాబాద్‌లోని మహావీర్ మెడికల్ కళాశాలల్లో పెరిగిన సీట్ల (200 నుంచి 250కి పెంపు) భర్తీకిఈ విడతలో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించింది. అయితే, మొదటి విడతలో సీటు వచ్చి చేరని వారు, చేరి మధ్యలోనే డిస్‌కంటిన్యూ అయినవారు, మొదటి విడతలో ఆప్షన్లు నమోదు చేయనివారు ఈ రెండో విడతకు అనర్హులని స్పష్టం చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 15న సీట్ల కేటాయింపు చేయనున్నారు. పూర్తి వివరాలు, నిబంధనల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని వర్శిటీ కోరింది.
తెలంగాణ మెడికల్ కాలేజీలు, సీట్లు
మొత్తం కళాశాలలు: 66
ప్రభుత్వ కళాశాలలు: 36 (మొత్తం సీట్లు: 4,400)
ప్రైౖవేట్ కళాశాలలు: 30 (మొత్తం సీట్లు: 6,050)
మొత్తం ఎంబీబీఎస్ సీట్లు: 10,450
పెరిగిన సీట్లు: 1,010 (ప్రభుత్వ: 110, ప్రైవేట్: 900)
ఈ వార్తలు కూడా చదవండి:
క్యూర్.. పాలనపై కేర్!
ఓ వీరప్పన్.. ఓ రేవంత్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News