Share News

416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:43 PM

భూ రీసర్వే వల్ల చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో భూ వివాదానికి కారణం కాకూడదని అధికారులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో భూ రీసర్వే పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు
TG Minister Pongulati Srinivas Reddy

హైదరాబాద్, నవంబర్10: భూ రీసర్వే వల్ల చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో భూ వివాదానికి కారణం కాకూడదని అధికారులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో భూ రీసర్వే పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి భూ యజమానికి స్పష్టమైన హక్కులు, కచ్చితమైన హద్దులే లక్ష్యమని పేర్కొన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూదార్ నంబర్ల కేటాయింపు వేగవంతం చేయాలని ఆదేశించారు. తరతరాలుగా పరిష్కారం కాని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.


అధికారులంతా పారదర్శకత, కచ్చితత్వంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి కోరారు. తెలంగాణలో ప్రస్తుతం సమగ్ర భూ రీసర్వే వెయ్యి గ్రామాలు దాటిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. భూ యజమానుల ప్రయోజనాలకే సర్వేలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగానే భూ సర్వే ప్రారంభించాలని పేర్కొన్నారు. సర్వే పూర్తయ్యాక భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలని తెలిపారు.


అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు భూ యజమానులకు అవకాశం కల్పించాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అలాగే రైతులకు సర్వే విధానం, అభ్యంతరాల పరిష్కారంపై అవగాహన కల్పించాలని కోరారు. తొలి దశలో 2,720 గ్రామాల్లో ప్రభుత్వం భూ రీసర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. 125 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి..

బాయిలర్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ

Read Latest TG Govt And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 05:48 PM