Share News

తెలంగాణ అభివృద్ధిని చాటేలా ఐఆర్‌సీ

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:51 AM

తెలంగాణ అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) 85వ సదస్సును నిర్వహించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.

తెలంగాణ అభివృద్ధిని చాటేలా ఐఆర్‌సీ
Komatireddy Venkat Reddy

  • పెట్టుబడుల ఆకర్షణకు వేదికగా నిర్వహణ..

  • రోజూ గంట పాటు కళాకారుల ప్రదర్శనలు

  • 19న కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం రేవంత్‌రెడ్డి

  • సదస్సును ప్రారంభిస్తారు: మంత్రి కోమటిరెడ్డి

  • ఐఆర్‌సీ నిర్వహణకు 12 కమిటీల నియామకం

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) 85వ సదస్సును నిర్వహించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. ఈ నెల 19 నుంచి 22 వరకు హైటెక్స్‌లో నిర్వహించే సదస్సు గురించి దేశంలోని ప్రధాన నగరాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని పేర్కొన్నారు. 19న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం రేవంత్‌ చేతుల మీదుగా సదస్సును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో సోమవారం రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని పనులు, ఐఆర్‌సీ సదస్సు ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను దేశ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసే వేదికగా ఐఆర్‌సీని నిర్వహించాలన్నారు. సదస్సుకు హాజరయ్యే అతిథులకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, పర్యాటక ప్రాంతాలను పరిచయం చేసేలా ప్రాంగణంలో 400 ఎగ్జిబిషన్‌ స్టాళ్లతో ‘తెలంగాణ పెవిలియన్‌’ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


నాలుగు రోజుల పాటు జరిగే సదస్సులో ప్రతి రోజూ తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేక కళా ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. రోజూ గంటపాటు కళాకారులతో ప్రదర్శనలు ఉండేలా చూడాలని, రాష్ట్ర ప్రత్యేకతను గుర్తు చేసేలా జ్ఞాపికలు అందించాలని సూచించారు. పర్యాటక శాఖ సమన్వయంతో సదస్సుకు వచ్చే అతిథులు, తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. డిసెంబరులో నిర్వహించే గ్లోబల్‌ సమ్మిట్‌కు.. ప్రీ సమ్మిట్‌గా ఐఆర్‌సీ నిలవాలని, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ఐఆర్‌సీలో రాష్ట్ర రహదారుల నెట్‌వర్క్‌, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన కీలక ప్రకటనలు ఉంటాయని పేర్కొన్నారు.


12 కమిటీల నియామకం

ఐఆర్‌సీ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 12 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆర్‌ అండ్‌ బీ శాఖ కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్లు, భోజనాల సదుపాయలు, రిసెప్షన్‌- రవాణా, వసతి, ఆర్థిక/రెవెన్యూ వ్యవహారాలు, టెక్నికల్‌ సెషన్స్‌, కొనుగోలుదారులు/విక్రయదారుల సమావేశాలు, ప్రచారం, సావనీర్‌, సాంస్కృతిక ప్రదర్శనలు, మెడికల్‌-ప్రోటోకాల్‌, వెబ్‌సైట్‌-ఐటీసీ, పర్యాటక ప్రదేశాల పర్యటనలు, వేదిక నిర్వహణకు వేర్వేరుగా కమిటీలను నియమించారు. ఇందులో రవాణా-రిసెప్షన్‌ కమిటీకి బి.వెంకటేశ్వరరావు, ఐ.నర్సింగరావును చైర్మన్లుగా నియమించగా, మరో 11 కమిటీలకు 11 మంది చైర్మన్లుగా వ్యవహరించనున్నారు. అలాగే, 25మంది కో చైర్మన్లు, సభ్యులుగా ఉంటారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ మెట్రోకు రూ.275 కోట్లు

ట్రూ-అప్‌ భారం ప్రజలపైనే..

నేడు అతి భారీ వర్షాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 05:51 AM