Share News

జోరుగా హెచ్‌పీవీ టీకాలు

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:48 AM

బాలికలకు భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌) ముప్పు నుంచి రక్షణ కల్పించే హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) వ్యాక్సినేషన్‌ తెలంగాణలో జోరుగా సాగుతోంది.

జోరుగా హెచ్‌పీవీ టీకాలు
Telangana HPV Vaccination

  • రాష్ట్రవ్యాప్తంగా 67 శాతం లక్ష్యం పూర్తి

  • 15 జిల్లాల్లో 70 శాతానికి పైగా నమోదు

  • టాప్‌లో పెద్దపల్లి.. అట్టడుగున కరీంనగర్‌

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): బాలికలకు భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌) ముప్పు నుంచి రక్షణ కల్పించే హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) వ్యాక్సినేషన్‌ తెలంగాణలో జోరుగా సాగుతోంది. ఈ ఏడాది మార్చి 8న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 67 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారు. 14-15 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు హెచ్‌పీవీ టీకాలు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వయసు బాలికలు 3,41,820 మంది ఉన్నట్లు హెడ్‌కౌంట్‌ సర్వేలో వెల్లడైంది. వీరిలో ఇప్పటివరకు 2,30,155 మందికి టీకాలు ఇచ్చారు. అక్టోబరు 30 నాటికి యూ-విన్‌ పోర్టల్‌లో ఈ వివరాలను అప్‌లోడ్‌ చేశారు. జిల్లాల వారీగా వ్యాక్సినేషన్‌ కవరేజీలో పెద్దపల్లి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ సర్వేలో గుర్తించిన 3,701 మంది బాలికలకు గాను 4,664 మందికి టీకాలు వేయడంతో 126 శాతం కవరేజీ నమోదైంది. హనుమకొండ జిల్లా 120 శాతంతో రెండో స్థానంలో ఉండగా, ఆదిలాబాద్‌ జిల్లా 100 శాతంతో మూడో స్థానంలో నిలిచింది.


ఖమ్మం జిల్లా 99 శాతం, నాగర్‌కర్నూల్‌ జిల్లా 91 శాతం కవరేజీతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఐదు జిల్లాలు 90 శాతానికి పైగా వ్యాక్సినేషన్‌ నమోదు చేశాయి. కరీంనగర్‌ జిల్లా కేవలం 49 శాతం కవరేజీతో చివరి స్థానంలో నిలిచింది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 54 శాతం చొప్పున, నిజామాబాద్‌, నారాయణపేట, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 55 శాతం చొప్పున వ్యాక్సినేషన్‌ నమోదైంది. నిర్మల్‌లో 56 శాతం, మహబూబ్‌నగర్‌లో 57 శాతం, కామారెడ్డి, మహబూబాబాద్‌, కొత్తగూడెం జిల్లాల్లో 58 శాతం కవరేజీ ఉంది. మొత్తం 33 జిల్లాల్లో 15 జిల్లాలు 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వ్యాక్సినేషన్‌ కవరేజీ సాధించాయి. పెద్దపల్లి, హనుమకొండ, ఆదిలాబాద్‌, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, భువనగిరి, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, జనగామ, వనపర్తి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, హైదరాబాద్‌ ఈ జాబితాలో ఉన్నాయి. కాగా రాష్ట్ర రాజధానిలో 42,360 మంది బాలికలను లక్ష్యంగా గుర్తించగా, ఇప్పటివరకు 29,808 మందికి టీకాలు వేశారు. దీంతో 70 శాతం కవరేజీ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మరో 1,11,665 మందికి టీకాలు వేయాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 05:48 AM