Share News

హిల్ట్‌కు ఏడాది.. అడుగు పడదేమి?

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:23 AM

హైదరాబాద్‌ నగర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైదరాబాద్‌ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం (హిల్ట్‌)’ అమలు.. అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు.

హిల్ట్‌కు ఏడాది.. అడుగు పడదేమి?

  • ముందుకు కదలని పరిశ్రమల తరలింపు..

  • భూముల మార్పిడిలో కనిపించని పురోగతి

  • 9,292 ఎకరాల్లోని 2,800 పరిశ్రమల తరలింపునకు ప్రణాళిక..

  • 450 ఎకరాల మేర తరలింపునకే దరఖాస్తులు

  • గడువు పొడిగింపులు, ఫీజులపై అభ్యంతరాలు, తరలించే ప్రాంతాలు, స్థలాలపై స్పష్టత లేక సమస్య

  • రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పరిస్థితులూ కారణమే!

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైదరాబాద్‌ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం (హిల్ట్‌)’ అమలు.. అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు. వివిధ కారణాలతో పరిశ్రమలను తరలించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాకపోవడం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం హిల్ట్‌ పాలసీని ప్రకటించి ఆదివారంతో ఏడాది పూర్తయింది. నగరం మధ్యలో ఉన్న పాత పారిశ్రామికవాడలను ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వెలుపలకు తరలించి.. ఆ భూములను నివాస, వాణిజ్య, ఇతర బహుళ అవసరాలకు ఉపయోగించడం, నగరంలో కాలుష్యాన్ని తగ్గించడం, పరిశ్రమలకు మెరుగైన వసతులు కల్పించడం ఈ విధానం లక్ష్యం. కానీ పారిశ్రామికవేత్తల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు.


9,292 ఎకరాల భూముల మార్పిడికి ప్రణాళిక

గత ఏడాది నవంబరు 22న రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్‌ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఔటర్‌ రింగురోడ్డు లోపల ఉన్న 22 పారిశ్రామికవాడల్లో సుమారు 2,800 పరిశ్రమల పరిధిలో ఉన్న 9,292 ఎకరాల భూములను బహుళ అవసరాల జోన్లుగా మార్చాలని నిర్ణయించింది. బాలానగర్‌, జీడిమెట్ల, సనత్‌నగర్‌, కూకట్‌పల్లి, నాచారం, ఉప్పల్‌, మల్లాపూర్‌, చర్లపల్లి, కాటేదాన్‌, పటాన్‌చెరు, రామచంద్రాపురం తదితర పారిశ్రామిక ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో చాలా వరకు దశాబ్దాల కిందటివే. వాటిలో కాలుష్య నియంత్రణ వ్యవస్థలు లేకపోవడం సమస్యగా మారుతోందని ప్రభుత్వం పేర్కొంది.


ఈ నేపథ్యంలో కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలకు తరలించి, వాటి స్థానంలో నివాస సముదాయాలు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, ఇతర పట్టణాభివృద్థి ప్రాజెక్టులను తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఐఐసీ)ని నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. కానీ మార్గదర్శకాల రూపకల్పనలో నెలల కొద్దీ జాప్యం జరిగింది. దీనితో టీజీఐఐసీ, పరిశ్రమల శాఖ పనితీరుపై విమర్శలు వచ్చాయి. ఇక భూముల వినియోగ మార్పిడికి విధిస్తున్న ఫీజులు, ఇతర చార్జీలు అధికంగా ఉన్నాయని పారిశ్రామికవేత్తల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.


గడువు పెంచినా స్పందన కరువు!

పారిశ్రామికవేత్తల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దరఖాస్తుల గడువును పొడిగించింది. పాత రిజిస్ట్రేషన్‌ విలువల ఆధారంగా ఫీజులు చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తరలింపు గడువును రెండేళ్లకు, భారీ పరిశ్రమలకు నాలుగేళ్లకు పెంచే ప్రతిపాదన కూడా వచ్చింది. అయినా పరిశ్రమల నుంచి పెద్దగా స్పందన రాలేదు. తరలింపునకు అయ్యే ఖర్చు, కొత్త ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, భూముల లభ్యత, వ్యాపార కార్యకలాపాలపై పడే ప్రభావం వంటి అంశాలపై తర్జనభర్జన జరుగుతోందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.


ఇప్పటివరకు మొత్తం 450 ఎకరాల భూములకు సంబంధించి 300 పరిశ్రమలు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అందులోనూ కొన్ని పలు కారణాలతో పెండింగ్‌లో పడినట్టు తెలిసింది. మరోవైపు హిల్ట్‌ పాలసీపై పరిశ్రమల యజమానులు వెనుకడుగు వేయడానికి రియల్‌ ఎస్టేట్‌ పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా కారణమని అంటున్నారు. భూముల వినియోగ మార్పిడికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా.. ఆ భూముల విక్రయాలు స్థాయిలో ఉంటాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నట్టు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం

ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 05:23 AM