హైడ్రా కమిషనర్ తొలగింపు ఆదేశాలు సబబే
ABN , Publish Date - Jul 31 , 2026 | 07:51 AM
హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను తొలగించి సరైన అధికారిని కమిషనర్‌గా నియమించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ఇటీవల ఇచ్చిన తీర్పును హైకోర్టు మరో జడ్జి జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ సమర్థించారు. అంతేకాక, హైడ్రా తీరును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మా సోదర జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నాం
కోర్టును తప్పుదోవ పట్టిసున్నారని పెద్ద నాయకులు అంటున్నారు
ప్రభుత్వ అధికారులే కోర్టును తప్పుదోవ పట్టించాలని యత్నిస్తున్నారు
హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు
కార్యనిర్వాహక చర్యలను సమీక్షించినందుకు హైకోర్టునే నిందిస్తారా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శ
ఓ కూల్చివేత కేసులో హైడ్రా తీరుపై తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను తొలగించి సరైన అధికారిని కమిషనర్‌గా నియమించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ఇటీవల ఇచ్చిన తీర్పును హైకోర్టు మరో జడ్జి జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ సమర్థించారు. అంతేకాక, హైడ్రా తీరును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇటీవల పెద్ద నాయకులు మాట్లాడుతున్నారని కానీ కోర్టులు తప్పుదోవ పట్టడం లేదని.. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలే న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆక్రమణదారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
హైడ్రాకు సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 60లో తమకు చెందిన 350 గజాల (ప్లాట్‌నెంబర్ 9/బీ) ప్రైవేటు భూమిలోకి హైడ్రా అధికారులు అక్రమంగా ప్రవేశించి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ప్రహరీ కూల్చివేశారంటూ పీ సుధారాణి అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా శేరిలింగంపల్లి తహసీల్దార్ ఆదేశాలతోనే కూల్చివేత చేపట్టామని హైడ్రా తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో శేరిలింగంపల్లి తహసీల్దార్ విచారణకు హాజరుకావాలని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఆదేశించారు. దీంతో సదరు తహసీల్దార్ గురువారం నాటి విచారణకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. అయితే, పిటిషనర్‌కు సంబంధించిన ప్లాట్‌లో కూల్చివేతలు చేపట్టమని తాను హైడ్రాకు చెప్పలేదని ధర్మాసనానికి తెలియజేశారు.
తాను సర్వే నెంబర్ 59 కోసం చెబితే, హైడ్రా అధికారులు పిటిషనర్ ప్లాట్ ఉన్న సర్వే నెంబర్ 60లో కూల్చివేతలు చేపట్టారని తహసీల్దార్ వివరణ ఇచ్చారు. దీంతో హైడ్రా అత్యుత్సాహంతో పిటిషనర్ ప్లాట్‌లో కూల్చివేతలు చేపట్టడమే కాక, తహసీల్దార్ ఆదేశిస్తేనే కూల్చివేశామని కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ హైడ్రాకు ఒక విధానం అంటూ లేదా ? సర్వే నెంబర్ 59లో ప్రభుత్వ భూమి కోసం తహసీల్దార్ చెబితే.. సర్వే నెంబర్ 60లోని పిటిషనర్‌భూమిలో కూల్చివేతలు ఎలా చేపడతారు ? కూల్చివేతలు చేపట్టేముందు సదరు భూమి ఏంటి ? ఎక్కడ ఉంది ? నోటీసు ఇచ్చారా ? లేదా ? వంటి కసరత్తు చేయరా ? తహసీల్దార్ నుంచి లేఖ వచ్చిన కేవలం మూడు రోజుల్లోనే హైడ్రా కూల్చివేతలకు దిగింది. పిటిషనర్‌కు నోటీసు జారీ అయిందా ? లేదా ? చూసుకోకుండా అంత తొందరపాటు దేనికి ? కలెక్టర్ నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా ? రాలేదు. అంత తొందరగా కూల్చివేయడానికి మీపై ఏమైనా బయటి శక్తులు ఒత్తిడి తెచ్చాయా ? ఒకవేళ అది ప్రభుత్వ భూమే అనుకున్నా.. ఆక్రమణదారులే అనుకున్నా.. కనీసం నోటీసు ఇచ్చి.. కొంత సమయం ఇవ్వాలి కదా ? ఇంత వేగం, అత్యుత్సాహం దేనికి ? ప్రభుత్వ భూములను కాపాడాలి అనుకుంటే ‘తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్ యాక్ట్ ’ ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
హైడ్రా సమాంతర కార్యనిర్వాహక వ్యవస్థను, ప్రభుత్వాన్ని నడిపిస్తోందా ? హైడ్రా చట్టవ్యతిరేక చర్యల నేపథ్యంలో సోదర జడ్జి జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ హైడ్రా కమిషనర్‌ను తొలగించాలని ఇచ్చిన తీర్పును మేం పూర్తిగా సమర్థిస్తున్నాం. కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని.. పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు.. ప్రస్తుత కేసు ప్రకారం ఎవరు ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారో తెలుస్తోంది కదా ? కోర్టులు తప్పుదోవ పట్టడం లేదు.. అధికారులు, ప్రభుత్వ సంస్థలే కోర్టును తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నాయి. న్యాయవ్యవస్థపై అలా మాట్లాడటం సమంజసం కాదు. కార్యనిర్వాహక చర్యలను సమీక్షించినందుకు హైకోర్టును నిందిస్తారా ? చట్టబద్ధమైన విధానాన్ని పాటించకుండా హైడ్రా ఏం అనుకుంటే అదే చేస్తోంది. హైకోర్టు ఆదేశాలను లెక్కచేయడం లేదు.
కూల్చివేతలు చేపట్టే ముందు.. రికార్డులు పరిశీలించడం లేదు. సర్వే చేయడం లేదు. పైగా కోర్టు ఆదేశాలనూ పట్టించుకోవడం లేదు. ఒక శాఖకు, మరో శాఖ సమన్వయం చేసుకునే విషయంలో పరిపాలన దారుణంగా విఫలమైంది ’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుత కేసులో పిటిషనర్ ప్లాట్‌లో కూల్చివేతలు చేపట్టిన వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా సహా ఇతర ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు ప్రతి వాయిదాకు తహసీల్దార్ ప్రత్యక్షంగా హాజరవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 8కి వాయిదా పడింది.
హైడ్రాకు విధించిన జరిమానా తగ్గింపు..
హైడ్రాకు సింగిల్ జడ్జి విధించిన రూ.50 వేల జరిమానాను చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం రూ.10 వేలకు తగ్గించింది. ఓ కేసులో ఏడాది కాలంగా కౌంటర్ వేయకుండా హైడ్రా తాత్సారం చేయడాన్ని తప్పుపడుతూ రూ.50 వేలు జరిమానా కట్టిన తర్వాతే కౌంటర్ వేయాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత భారీ జరిమానా విధించడం చెల్లదని పేర్కొంటూ హైడ్రా.. డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసింది. దీంతో డివిజన్ బెంచ్ ఆ జరిమానాను రూ.10 వేలకు తగ్గించింది. తగ్గించిన జరిమానా చెల్లించి రశీదును కౌంటర్‌తోపాటు సింగిల్ జడ్జికి సమర్పించాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు