ఏజెన్సీలో భూమి ఉన్న గిరిజనేతరుల సివిల్ వివాదాలను సివిల్ కోర్టే పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:05 AM
ఏజెన్సీలో భూమి ఉన్న గిరిజనేతరుల మధ్య భూ వివాదాలను సివిల్ కోర్టు మాత్రమే పరిష్కరించాలని.. అలాంటి వివాదాలపై ఏజెన్సీ కోర్టు (ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్ కం ఆర్డీవో)లకు అధికార పరిధి లేదని హైకోర్టు పేర్కొంది.
ఏజెన్సీ కోర్టులకు అధికార పరిధి లేదు: హైకోర్టు
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో భూమి ఉన్న గిరిజనేతరుల మధ్య భూ వివాదాలను సివిల్ కోర్టు మాత్రమే పరిష్కరించాలని.. అలాంటి వివాదాలపై ఏజెన్సీ కోర్టు (ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్ కం ఆర్డీవో)లకు అధికార పరిధి లేదని హైకోర్టు పేర్కొంది. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం, కొండనాగుల గ్రామంలోని సర్వే నెంబర్ ‘2/ఈ’ లో ఉన్న 36 గుంటల భూమిపై గిరిజనేతరుల మధ్య వివాదం ఏర్పడింది.
విచారణ చేపట్టిన ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్ కం ఆర్డీవో ఎక్స్‌పార్టీ ఇంజెంక్షన్ ఆర్డర్ జారీచేశారు. దీనిని సవాల్ చేస్తూ వెంకటయ్య అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది టీ సూర్యసతీశ్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో పిటిషనర్ లేదా ప్రతివాదులు గిరిజనులు కాదని.. షెడ్యూల్ ఏరియాలో భూమి ఉన్నంత మాత్రాన గిరిజనేతరుల మధ్య ఏర్పడ్డ సివిల్ వివాదాలను కూడా ఏజెన్సీ కోర్టు (ఆర్డీవో) విచారించలేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసన ప్రస్తుత కేసులో గిరిజనుల ఆసక్తులు ఏవీ ఇమిడి లేవని.. ఇరుపక్షాల్లో ఏ పక్షం కూడా గిరిజనులు కాదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ కోర్టుకు ఉన్న ప్రత్యేక అధికార పరిధి ఈ వివాదానికి వర్తించదని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్ వెస్లీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News