’విరమణ ప్రయోజనాల’పై 10 శాతం వడ్డీ చెల్లించాల్సిందే!
ABN , Publish Date - Nov 15 , 2026 | 05:29 AM
ఉద్యోగ విరమణ (రిటైర్‌మెంట్ బెనిఫిట్స్) విషయంలో ఓ రిటైర్డ్ ఉద్యోగికి అనుకూలంగా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
రిటైర్డ్ ఉద్యోగికి అనుకూలంగా హైకోర్టు తీర్పు..
వారాల్లోగా చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశం
లేదంటే ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి హాజరవ్వాలి
రిటైర్డ్ ఉద్యోగి కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ విరమణ (రిటైర్‌మెంట్ బెనిఫిట్స్) విషయంలో ఓ రిటైర్డ్ ఉద్యోగికి అనుకూలంగా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో తాము ఉత్తర్వుల్లో పేర్కొన్న గడువులోగా కక్షిదారుకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు చెల్లించ లేదని, ఆ కారణంగా మొత్తం ప్రయోజనాలపై 10శాతం వడ్డీని ఆయనకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ వడ్డీ మొత్తాన్ని మూడు వారాల్లోగా కక్షిదారుకు ఇవ్వాలని, లేని పక్షంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా తమ ఎదుట ప్రత్యక్షంగా హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కామారెడ్డికి చెందిన బేతి కోనారెడ్డి రిటైర్డ్ ఎస్సై! ఆయన 2024 డిసెంబరు 31న ఉద్యోగ విరమణ చేశారు. ఏడాది గడిచినా తనకు ఉద్యోగ విరమణ తాలూకు ప్రయోజనాలు అందకపోవడంతో ఆయన గత ఫిబ్రవరి 23న హైకోర్టులో పిటిషన్ వేశారు.
విచారణ చేపట్టిన జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం.. ఆరు వారాల్లో పిటిషనర్‌కు సంబంధించిన ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించాలని, లేకపోతే రిటైర్ అయినప్పటి నుంచి చెల్లింపు తేదీ వరకు 10శాతం వడ్డీ చెల్లించాలని తీర్పు వెలువరించింది. అయితే ఆరువారాలు గడిచినా ఈ తీర్పు అమలు కాలేదంటూ కోనారెడ్డి, కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌పై జస్టిస్ మాధవీదేవి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆరువారాల గడువులోగా పిటిషనర్‌కు ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించలేదని.. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో బెనిఫిట్స్ మాత్రమే క్లియర్ చేశారని.. కోర్టు ఆదేశాల మేరకు 2024 డిసెంబరు 31 నుంచి ఈ ఏడాది నవంబరు వరకు అంటే దాదాపు 23 నెలలకు 10 శాతం వడ్డీ చెల్లించలేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. వడ్డీ చెల్లింపుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని కోరగా ఆయన సమయం ఇవ్వాలని కోరారు. దీంతో విచారణ డిసెంబరు 4వ తేదీకి వాయిదా వేశారు. ఆ లోగా వడ్డీ చెల్లించకపోతే ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ప్రత్యక్షంగా హాజరుకావాలని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.
జిల్లా న్యాయవ్యవస్థ పనిచేయాలంటే కోర్టు కాంప్లెక్స్ ఉండాలి: హైకోర్టు
జిల్లా న్యాయవ్యవస్థ ప్రభావవంతంగా పనిచేయాలంటే జిల్లా కోర్టు కాంప్లెక్స్ భవనం ఉండాలని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. గద్వాల జిల్లా కోర్టు భవన సముదాయం నిర్మాణానికి భూమి కేటాయించినా నిర్ణీత గడువులోపు నిర్మాణాలు ప్రారంభించలేదని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శాంకోషీ, జస్టిస్ చలపతిరావు ధర్మాసనం, ప్రతిపాదిత స్థలంలో గడువులోగా నిర్మాణాలు ప్రారంభించి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News