యాంత్రికంగా కాగ్నిజెన్స్ ఉత్తర్వులు
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:55 AM
కొంతమంది న్యాయాధికారులు న్యాయ వివేచన(లీగల్ మైండ్) వినియోగించకుండా కేవలం రబ్బర్ స్టాంప్ ఉపయోగించి కాగ్నిజెన్స్(నేరాన్ని పరిగణనలోకి తీసుకోవడం) ఉత్తర్వులు జారీ చేయడాన్ని హైకోర్టు ఇటీవల తప్పుపట్టింది.
ఆ న్యాయాధికారులకు శిక్షణ ఇవ్వాలన్న హైకోర్టు
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కొంతమంది న్యాయాధికారులు న్యాయ వివేచన(లీగల్ మైండ్) వినియోగించకుండా కేవలం రబ్బర్ స్టాంప్ ఉపయోగించి కాగ్నిజెన్స్(నేరాన్ని పరిగణనలోకి తీసుకోవడం) ఉత్తర్వులు జారీ చేయడాన్ని హైకోర్టు ఇటీవల తప్పుపట్టింది. కాగ్నిజెన్స్ ఉత్తర్వులు ఎలా రాయాలి? ఒక నేరాన్ని పరిగణనలోకి తీసుకునేటప్పుడు ఎలాంటి న్యాయపరమైన అంశాలను, సూత్రాలను అనుసరించాలి? అనే అంశాలపై సంబంధిత న్యాయాధికారులకు శిక్షణ ఇవ్వాలని తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనను హత్య చేయడానికి యత్నించారని పేర్కొంటూ గచ్చిబౌలి ఇంద్రానగర్‌కు చెందిన కోడూరు పిచ్చేశ్వర్‌రావు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఏడుగురు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు పూర్తికావడంతో కూకట్‌పల్లి పదో అదనపు జ్యుడీషియల్ మేజిస్ర్టేట్ వద్ద విచారణకు వచ్చింది.
నిందితులపై కాగ్నిజెన్స్ తీసుకునే క్రమంలో మేజిస్ర్టేట్ యాంత్రికంగా, తాను ప్రాథమికంగా సంతృప్తి చెందినట్లు ఎలాంటి కారణాలు వివరించకుండా ఉత్తర్వులు జారీ చేశారని.. ఇలా చేయడం వల్ల సదరు ఉత్తర్వులు పై కోర్టుల్లో న్యాయ సమీక్షకు నిలబడే అవకాశాలు ఉండవని.. ఆ ఉత్తర్వులను కొట్టేసి.. తాజాగా తగిన కారణాలతో ఉత్తర్వులు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని ఫిర్యాదుదారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జె. శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ ఆరోపించిన విధంగానే సదరు కాగ్నిజెన్స్ ఉత్తర్వులు ప్రమాణాల ప్రకారం లేదని నిర్ధారణకు వచ్చిన హైకోర్టు.. వాటిని కొట్టేయడంతోపాటు తాజాగా చట్టప్రకారం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మళ్లీ కాగ్నిజెన్స్ ఉత్తర్వులు జారీ చేయాలని ఆ మేజిస్ర్టేట్‌కు ఆదేశాలు జారీ చేసింది.
ఇలాగే కొంతమంది న్యాయాధికారులు నేరాలను పరిగణనలోకి తీసుకునే క్రమంలో ప్రమాణాలను పాటించకుండా, ఎందుకు సంతృప్తి చెందారో తగిన కారణాలు రికార్డు చేయకుండా కేవలం రబ్బర్ స్టాంప్ వేసి ఉత్తర్వులు జారీ చేస్తుండటాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. మరికొంతమంది మేజిస్ర్టేట్‌లు ‘కాగ్నిజెన్స్’ దశలోనే నిందితులు నేరం చేశారనే ముగింపునకు వస్తున్నారని పేర్కొంది. లోపభూయిష్టంగా జనవరి నుంచి జారీ అయిన 500 కాగ్నిజెన్స్ ఉత్తర్వులను ఈ హైకోర్టు కొట్టేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి.
గ్రూప్-1 ఆఫీసర్లుగా ఉపాధి కూలీ పిల్లలు
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News