కంపెనీలపై విద్యుత్ సర్‌చార్జీలు ఓకే
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:38 AM
సొంత వినియోగం కోసం ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కరెంటు కొనుగోలు చేసినప్పటికీ.. డిస్కంలకు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
డిస్కంలు వసూలు చేసుకోవచ్చు
ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కరెంటు కొన్నా సర్‌చార్జి చెల్లించాల్సిందే
నాటి జీవోలతో మినహాయింపు లభించదు
స్పష్టం చేసిన హైకోర్టు..
పలు ప్రముఖ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ల కొట్టివేత
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సొంత వినియోగం కోసం ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కరెంటు కొనుగోలు చేసినప్పటికీ.. డిస్కంలకు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్).. పలు ప్రైవేటు కంపెనీలకు జారీ చేసిన డిమాండ్ నోటీసులను సమర్థించింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ కంపెనీలు దాఖలు చేసిన దాదాపు 27 పిటిషన్లను కొట్టేసింది. దీంతో డిస్కంలు సర్‌చార్జీలను వసూలు చేసేందుకు మార్గం సుగమమైంది. సర్‌చార్జి చెల్లింపు నుంచి తమకు మినహాయింపు ఉందని, టీజీఎస్పీడీసీఎల్ జారీచేసిన నోటీసులు చెల్లవని పేర్కొంటూ మై హోం ఎస్టేట్స్, డాల్ఫిన్ హోటల్స్, గ్రీన్‌పార్క్ హోటల్స్, ఆర్‌ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా, మైహోం టైకూన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హోటల్ కమల్, యశోద హెల్త్‌కేర్ సర్వీసెస్, సాయిబోధ హోటల్స్, మహేశ్వరి ఆయిల్ ఇండస్ట్రీస్, టాటా టెలీసర్వీసెస్, శ్రీనివాస రిసార్ట్స్, ఎల్వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, యూనిమెడ్ హెల్త్ కేర్, అపోలో హాస్పిటల్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ తదితర కంపెనీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
వీటిపై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ‘పిటిషనర్లు అయిన కంపెనీలకు విద్యుత్ అమ్ముకోవడానికి ఆయా ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు 1997, 1998లో జారీచేసిన 93, 112 జీవోల ద్వారా అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాబట్టి, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి వర్తించదు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘93, 112 జీవోల ఉద్దేశం వేరు. వాటిని ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్-1948 కింద ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఇచ్చిన అంగీకారంగా భావించరాదు. పైగా, ఆ జీవోల చెల్లుబాటు కాలం మూడేళ్లు మాత్రమే. కాలం చెల్లిపోయిన జీవోల కింద క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి మినహాయింపు వర్తిస్తుందని పిటిషనర్ కంపెనీలు భావించడం సరికాదు’ అని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు విద్యుత్‌ను అమ్ముకోవడానికి అనుమతి కల్పించే ఉద్దేశంతోనే సదరు జీవోలను జారీ చేశారని, వాటి ఆధారంగా క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి మినహాయింపును కోరలేరని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు పన్ను మినహాయింపు ఇచ్చినప్పుడు మాత్రమే క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి నుంచి మినహాయింపు లభిస్తుందని తెలిపింది. పిటిషనర్ కంపెనీల పిటిషన్లను డిస్మిస్ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి చాటాలి
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News