Share News

ఉమ్మడి కుటుంబాలు లేకే ఆటిజం!

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:03 AM

సంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా క్షీణించడం వల్లే చిన్నారుల్లో ఆటిజం పెరిగే అవకాశాలు ఎక్కువయ్యాయని హైకోర్టు అభిప్రాయపడింది.

ఉమ్మడి కుటుంబాలు లేకే ఆటిజం!

  • తల్లిదండ్రుల కలహాలు చిన్నారుల ఎదుగుదలకు శాపం కారాదు

  • విడాకులు తీసుకున్నా బిడ్డల

  • బాధ్యత తప్పదు: హైకోర్టు

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా క్షీణించడం వల్లే చిన్నారుల్లో ఆటిజం పెరిగే అవకాశాలు ఎక్కువయ్యాయని హైకోర్టు అభిప్రాయపడింది. తల్లిదండ్రుల మధ్య వ్యక్తిగత విభేదాలు, వైవాహిక కలహాలు పిల్లల మానసిక ఎదుగుదలకు, సంక్షేమానికి నష్టం కలిగించకూడదని స్పష్టం చేసింది. భార్యాభర్తలు విడాకుల ద్వారా విడిపోయినంత మాత్రాన తల్లిదండ్రుల బాధ్యతల నుంచి విముక్తి పొందలేరని జస్టిస్‌ కె. లక్ష్మణ్‌, జస్టిస్‌ కె. సుజన ధర్మాసనం తేల్చి చెప్పింది. వైద్య దంపతుల విడాకుల కేసు విచారణ సందర్భంగా ఽకీలక వ్యాఖ్యలు చేసింది. ఆటిజం ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు తమ విభేదాలు పక్కనబెట్టి, వారి భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించింది.


ఈ వివాదంలో హైదరాబాద్‌ ఫ్యామిలీ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలనూ పరిగణనలోకి తీసుకుని తాజాగా తీర్పు వెలువరించాలని ఆదేశించింది. పిల్లల పెంపకంలో ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యాన్ని హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘‘పట్టణీకరణ, వలసలు, ఉపాధి విధానాల వల్ల పిల్లల బాధ్యత తల్లిదండ్రులపైనే పడింది. గతంలో తాతమ్మలు, ఇతర కుటుంబ సభ్యుల ప్రమేయం పిల్లల్లో భావోద్వేగ భద్రత, నైతికత, సమాజంలో మెలిగే తీరు అలవడేవి.’’అని పేర్కొంది. ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ (ఏఎస్డీ) ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రుల బాధ్యత మరింత పెరుగుతుందని, తల్లిదండ్రుల మధ్య కొనసాగే సంఘర్షణ పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.


పాఠశాల విద్య కార్యాలయాల్లో.. లైంగిక వేధింపులపై ఫిర్యాదుకు కమిటీలు

పని ప్రాంతంలో లైంగిక వేధింపులపై ఫిర్యాదుల స్వీకరణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్య విభాగం ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య సంచాలకులు నవీన్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి, మండల విద్యా శాఖాధికారి కార్యాలయాలతోపాటు పాఠశాల స్థాయుల్లోనూ ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని డీఈవో, ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులను కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆరనీకుమా ఈ దీపం..

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 06:03 AM