అన్నదాతలకు గుడ్ న్యూస్.. సోమవారం నుంచే ఆ కార్యక్రమం ప్రారంభం..
ABN , Publish Date - Apr 26 , 2026 | 07:44 PM
తెలంగాణ వ్యాప్తంగా రేపటి (సోమవారం) నుంచి మే 23 వరకూ 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు గ్రామాలకు వెళ్లనున్నారని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రేపటి (సోమవారం) నుంచి మే 23 వరకూ 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు గ్రామాలకు వెళ్లనున్నారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, అధికారులు, విద్యార్థులతో కూడిన 200 బృందాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఈ బృందాలు ప్రతి వారం 400 గ్రామాలకు వెళ్లి రైతులతో నేరుగా సమావేశాలు నిర్వహిస్తాయని తుమ్మల పేర్కొన్నారు.
గ్రామాల్లో పర్యటన సందర్భంగా 2.45 లక్షల మంది అన్నదాతలకు పలు అంశాలపై శిక్షణ ఇస్తారని మంత్రి తుమ్మల వెల్లడించారు. యూరియా వాడకం తగ్గింపు, సమతుల్య ఎరువులు, సాగునీటి పొదుపు, సేంద్రీయ వ్యవసాయంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు మేలు చేసేలా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న 8 రకాల వరి విత్తనాలను ఇప్పటికే గుర్తించినట్లు వెల్లడించారు. BPT 5204, తెలంగాణ సోన (RNR 15048), KNM 1638, జై శ్రీరాం, HMT, WGL 962, WGL 44, TGC 1798 రకాల విత్తనాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ వానాకాలం సీజన్‌కు ముందే విత్తనాలను జిల్లాల వారీగా రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
వీటిని అన్నదాతలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఈ ఏడాది తెలంగాణపై ఎల్ నినో (El Nino) ప్రభావం ఉండనుందని తెలిపారు. దీంతో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఆయిల్ పామ్ సాగు చేయాలని ఈ సందర్భంగా రైతులకు మంత్రి సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తూ సాగు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి సెటైర్లు వేసిన కేటీఆర్..
జనగణన వల్ల ప్రభుత్వ పథకాలు నిలిచిపోవు: మంత్రి కిషన్ రెడ్డి