Share News

మద్యం మత్తులో యువకుల వీరంగం.. ఆర్టీసీ సిబ్బందిపై దాడి..

ABN , Publish Date - Apr 26 , 2026 | 06:48 PM

మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. ఏకంగా ఆర్టీసీ సిబ్బందిపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మద్యం మత్తులో యువకుల వీరంగం.. ఆర్టీసీ సిబ్బందిపై దాడి..
Attack on RTC Employees

రంగారెడ్డి: మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. ఏకంగా ఆర్టీసీ సిబ్బందిపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హయత్ నగర్ డిపో-2కి చెందిన ఆర్టీసీ బస్సు కుంట్లూరు గ్రామానికి వెళ్తోంది. హయత్ నగర్‌లో పూటుగా మద్యం తాగిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై కుంట్లూరు వైపునకు వెళ్తున్నారు. అయితే, మార్గమధ్యంలో తాము ముందుకు వెళ్లేందుకు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని యువకులు ఆగ్రహించారు.


కుంట్లూరుకు బస్సు చేరుకోగానే క్రాస్ చేసి మరీ వారి బైక్‌ను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. బస్సు ఆగిన వెంటనే లోపలికి వెళ్లి డ్రైవర్‌పై దాడికి దిగారు. అడ్డొచ్చిన కండక్టర్‌నీ తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో డ్రైవర్, కండక్టర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. యువకులను నిలువరించే ప్రయత్నం చేసిన ప్రయాణికులపైనా బెదిరింపులకు దిగారు. స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.


మరోవైపు నల్లగొండలోనూ ఈరోజు ఇలాంటి ఘటనే జరిగింది. నల్లగొండ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సును ఆపనందుకు డ్రైవర్ రామ్ కుమార్‌పై ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. తాము నిల్చున్న చోట బస్సు ఆపలేదంటూ విచక్షణారహితంగా కొట్టాడు. డ్రైవర్ ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకే రోజు రెండు ఘటనలు జరగడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమపై దాడికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి సెటైర్లు వేసిన కేటీఆర్..

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకోవడం సిగ్గుచేటు: ఎంపీ రఘునందన్ రావు

Updated Date - Apr 26 , 2026 | 07:00 PM