Share News

సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి సెటైర్లు వేసిన కేటీఆర్..

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:07 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటివరకూ అమలు కాలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచాయని.. ఇప్పటివరకు ఇచ్చిన హామీలను రేవంత్ నెరవేర్చలేదని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి సెటైర్లు వేసిన కేటీఆర్..
KTR Slams CM Revanth

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటివరకూ అమలు కాలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచాయని.. ఇప్పటివరకు ఇచ్చిన హామీలను రేవంత్ నెరవేర్చలేదని మండిపడ్డారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని రేవంత్ చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని యాంకర్లు, యాక్టర్లు కూడా గుర్తుపట్టడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీలో కమల్‌ హాసన్‌‌ని మించిన నటులు ఉన్నారని కేటీఆర్ అన్నారు. భారతదేశంలో ఏ పార్టీకి లేని విశిష్టత బీఆర్ఎస్‌కు ఉందన్నారు. మూడు, నాలుగు అడుగులు ఉన్నవారు కూడా కేసీఆర్ గురించి ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తాము అన్నో ఇన్నో తప్పులు చేసి ఉంటామని, అందుకే ప్రజలు అధికారం ఇవ్వలేదన్నారు.


60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మూసీని కంపు చేశారని.. ఫ్లోరైడ్‌కి కారణం ఆ పార్టీనే అంటూ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నీళ్లను కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసమే కేసీఆర్ అప్పు చేశారని.. అది తెలంగాణకు పెట్టుబడిగా అభివర్ణించారు. రూ.3.70 లక్షల కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అన్ని వర్గాల వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదని.. కేసీఆర్‌ని ముఖ్యమంత్రిని చేసే ఎన్నికలని కేటీఆర్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాష్ట్ర ప్రజలంతా జనగణనలో పాల్గొనాలి: తెలంగాణ గవర్నర్ పిలుపు

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకోవడం సిగ్గుచేటు: ఎంపీ రఘునందన్ రావు

Updated Date - Apr 26 , 2026 | 06:22 PM